- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ప్రజాప్రతినిధులపై 5 వేల కేసులు పెండింగ్..!
క్రిమినల్ నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: క్రిమినల్ నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాల నిషేధం విధించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరిగింది. దోషులుగా తేలిన వారిపై నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో పిల్ దాఖలు చేశారు. దీనిపైనే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ప్రస్తుతం, పార్లమెంటు, శాసనసభ సిట్టింగ్ సభ్యులు, మాజీ సభ్యులపై దాదాపు 5 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ నివేదికలో ఉంది. 42 శాతం మంది లోక్ సభ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడయ్యింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు.
కోర్టు ఏమందంటే?
దీనిపైనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. " హత్య లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తి క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందలేడు. కానీ, క్రిమినల్ కేసులున్న వ్యక్తి మాత్రం ఎంపీ లేదా ఎమ్మెల్యే కావచ్చు. మంత్రి కూడా కావచ్చు. అందుకే, భారత ప్రజాప్రాతినిధ్య చట్టం(RP Act) లోని సెక్షన్ 8, 9లను పరిశీలిస్తాం" అని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని.. దానికి అనుగుణంగా సరైన పరిష్కారం ఆలోచించాలని సూచించింది. ఈ అంశంపై సమగ్ర తీర్పును జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులోనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా, విచారణ ప్రారంభంలో పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు చేసింది. "మీ లక్ష్యం రాజకీయాలను నేరరహితం చేయడం. అది ఒక దేశంగా మనం సాధించాల్సిన విషయం. కానీ మనం సగం సగం పనులు చేయవద్దు. అలా చేస్తే, ప్రజలు మోసపోయామనుకుంటారు" అని పేర్కొంది.






