- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సీన్లు కొరత ఉండొద్దు.. కరోనా వేళ ఆస్పత్రులకు ఆదేశాలు!
ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సీన్లు అందుబాటులో ఉంచాలని వివిధ రాష్ట్రాల్లో ఆస్పత్రులకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అలర్ట్‌లో ఉండాలని హాస్పిటల్స్‌కు ఆదేశాలు జారీ చేశాయి. మూడేళ్ల తర్వాత దేశ రాజధానిలో కొత్త కరోనా కేసులు నమోదవడం గమనార్హం. ఇక్కడ తాజాగా 23 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రమైనవి లేవని, దాదాపుగా అన్ని కేసుల్లో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
కేవలం భారత్‌లోనే కాకుండా దక్షిణాసియాలోని పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ జేఎన్1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది గతంలో చెలరేగిన ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జేఎన్1 వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది కానీ.. ఇది ఆందోళన చెందాల్సిన వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తించలేదు. ఈ కేసుల్లో లక్షణాలేవీ తీవ్రంగా లేవని, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు కూడా నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారని నిపుణులు తెలిపారు. ఈ వేరియంట్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఢిల్లీలో ఇప్పటికే 23 కొత్త కరోనా వైరస్ కేసులు కనిపించాయి. దీంతో ఆస్పత్రులన్నింట్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సీన్లు అందుబాటులో ఉంచాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త వేరియంట్ కేవలం ఇన్‌ఫ్లూయెంజా వంటిదేనని, కాబట్టి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ చెప్పారు. అలాగే ఆస్పత్రుల్లో కనిపించే ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే (ఎస్ఏఆర్ఐ) తరహా వ్యాధుల వివరాలను హెల్త్ డేటా వేదికలో నమోదు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది.
దేశంలో అత్యధికంగా కేరళలో ఒక్క మే నెలలోనే 273 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ అధికారులు అలర్ట్‌గా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫేస్ మాస్కులు తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే జలుబు వంటి లక్షణాలు ఉన్న ప్రజలు కూడా మాస్కులు ధరించాలని సూచించింది. కర్ణాటకలో కూడా 35 కేసులు వెలుగు చూడటంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న అందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించింది. మహారాష్ట్రలో వెలుగు చూసిన కేసుల్లో అత్యధికం ముంబై నగరంలోనే కనిపించాయి. ఇక్కడ మే నెలలో 95 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కూడా జలుబు వంటి లక్షణాలున్న వారు కరోనా టెస్టు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల కనిపించలేదు కానీ.. ఆస్పత్రుల్లో వ్యాక్సీన్లు, పీపీఈ కిట్లు, మూడు లేయర్ల మాస్కులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్న దేశాల నుంచి వచ్చే వారందరూ కొవిడ్ టెస్టు చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది కరోనా బాధితులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఎంతోమంది కరోనా కన్నా ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే మరణించారని రిపోర్టులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.






