- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్నోలో ఘోరం : తండ్రిని కాల్చి చంపి.. ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కిన కొడుకు
లక్నోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోమని ఒత్తిడి చేస్తున్నాడన్న కోపంతో ఓ 21 ఏళ్ల యువకుడు తన కన్నతండ్రినే కిరాతకంగా అంతమొందించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: లక్నోలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోమని ఒత్తిడి చేస్తున్నాడన్న కోపంతో ఓ 21 ఏళ్ల యువకుడు తన కన్నతండ్రినే కిరాతకంగా అంతమొందించాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఇంట్లోని ఓ డ్రమ్ములో దాచిపెట్టిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వర్థమాన్ పాథాలజీ యజమాని అయిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఫిబ్రవరి 20 నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, మన్వేంద్ర కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ ప్రవర్తనపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారించగా, తండ్రిని తానే చంపినట్లు అక్షత్ నేరాన్ని అంగీకరించాడు.
హత్యకు కారణం: పోటీ పరీక్షల ఒత్తిడి
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అక్షత్ తన తండ్రి మన్వేంద్రపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. తండ్రి తనను నిరంతరం పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఒత్తిడి చేస్తుండటమే అందుకు కారణం. ఈ క్రమంలో ఫిబ్రవరి 20 తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తండ్రితో వివాదం చెలరేగడంతో, ఇంట్లోనే ఉన్న రైఫిల్‌తో అక్షత్ తన తండ్రిని కాల్చి చంపాడు. హత్య చేసిన అనంతరం నేరాన్ని దాచి పెట్టేందుకు అక్షత్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. మూడవ అంతస్తులో ఉన్న తండ్రి మృతదేహాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక గదిలోకి తీసుకువచ్చాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొన్ని భాగాలను ఒక నీలం రంగు డ్రమ్ములో కుక్కి ఇంట్లోనే దాచేశాడు. మరికొన్ని శరీర భాగాలను సమీపంలోని సదరౌనా గ్రామం వద్ద పారేశాడు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ విక్రాంత్ వీర్ నేతృత్వంలోని బృందం, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇంట్లో సోదాలు నిర్వహించగా డ్రమ్ములో దాచిన శరీర భాగాలు లభ్యమయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.






