ముంబై పాలిటిక్స్‌లో చారిత్రాత్మక పరిణామం.. బీఎంసీ మేయర్‌గా రితూ తావ్డే

by Kema Shiva Kumar |

ముంబై రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది.

ముంబై పాలిటిక్స్‌లో చారిత్రాత్మక పరిణామం.. బీఎంసీ మేయర్‌గా రితూ తావ్డే
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతు తావ్డే (Ritu Tawde) బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 44 ఏళ్లలో బీజేపీకి చెందిన నాయకులు ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా బీఎంసీపై శివసేన కొనసాగిస్తున్న ఆధిపత్యానికి ఈ ఎన్నికతో తెరపడింది. అయితే, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT), ఇతర ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో రీతు తావ్డే ఎన్నిక ఏకగ్రీవమైంది. మరాఠీ అస్తిత్వాన్ని గౌరవిస్తూ మహాయుతి కూటమికి ఉన్న మెజారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా రీతు తావ్డే మాట్లాడుతూ.. నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పౌరుల భద్రతకు తము అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ముంబైకి తాను కేవలం మేయర్‌గా మాత్రమే కాకుండా ఒక సేవకురాలుగా పనిచేస్తానని రీతు తావ్డే అన్నారు.

కాగా, 1982-83లో ప్రభాకర్ పాయ్ (Prabhakar Pai) తర్వాత బీజేపీ నుంచి మేయర్ అయిన మొదటి వ్యక్తి రీతు తావ్డేనే. 2022 మార్చి నుంచి అడ్మినిస్ట్రేటర్ పాలనలో ఉన్న బీఎంసీకి ఇప్పుడు కొత్త నాయకత్వం లభించింది. ఘాట్‌కోపర్ ఈస్ట్ (Ghatkopar East) నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచిన రీతు తావ్డే, గతంలో బీఎంసీ విద్యా కమిటీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అదేవిధంగా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 227 సీట్లున్న బీఎంసీలో 89 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. షిండే శివసేన 29 సీట్ల మద్దతుతో మహాయుతి కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించింది.

Next Story