- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్కింగ్ లాట్‌ను తలపిస్తున్న హిమాలయాలు.. చార్‌ధామ్ మార్గంలో 30 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాలు ప్రస్తుతం భారీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ పర్వత ప్రాంతాలు ప్రస్తుతం భారీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఒకవైపు వారాంతపు సెలవులు, మరోవైపు చార్‌ధామ్ యాత్ర రద్దీ తోడవడంతో పచ్చని హిమాలయాలు అచ్చం ‘పార్కింగ్ లాట్’లను తలపిస్తున్నాయి. ముఖ్యంగా జోషీమఠ్ సమీపంలో దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు రోడ్ల మీదే చిక్కుకుపోయారు.
నరకప్రాయంగా మారిన యాత్ర
ఇరుకైన పర్వత మార్గాల్లో విపరీతమైన రద్దీ కారణంగా విష్ణు ప్రయాగ నుంచి జోషీమఠ్ మీదుగా మార్వాడి వరకు ఎటుచూసినా వాహనాల బారులే కనిపిస్తున్నాయి. గంటల తరబడి కార్లల్లోనే చిక్కుకుపోయిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలైన తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు లేక పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ముస్సోరీ, నైనిటాల్, మనాలీ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ప్రకృతి ప్రేమికుల ఆందోళన
నియంత్రణ లేని ఈ పర్యాటక ప్రవాహం హిమాలయాల సున్నితమైన పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోషీమఠ్ లాంటి ప్రాంతాల మనుగడను కాపాడాలంటే.. పర్వత ప్రాంతాల్లోకి అనుమతించే వాహనాల సంఖ్యపై తక్షణమే కఠిన నియంత్రణలు విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు స్థానిక పోలీసులు, యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ, రద్దీ విపరీతంగా ఉండటంతో వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






