- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభలో కేంద్రం వర్సెస్ తమిళనాడు.. కేంద్రమంత్రిపై ద్రవిడ ఎంపీ నోటీసులు
పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ వాదనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా లోక్‌సభలో నూతన విద్యా విధానం, హిందీ భాష ఆధిపత్యంపై డీఎంకే వర్సెస్ కేంద్రం అన్నట్టుగా చర్చ సాగింది. లోక్‌సభలో కొశ్చన్ అవర్‌తో మొదలైన సమావేశాలు స్వల్ప వ్యవధిలోనే ఆందోళనలను చవిచూసింది. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సమర్పించేదాకా పరిస్థితులు వెళ్లాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు(Budget Session) ప్రారంభమైన తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ వాదనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ(Lok Sabha)లో నూతన విద్యా విధానం(NEP), హిందీ భాష ఆధిపత్యంపై డీఎంకే(DMK) వర్సెస్ కేంద్రం అన్నట్టుగా చర్చ సాగింది. లోక్‌సభలో కొశ్చన్ అవర్‌తో మొదలైన సమావేశాలు స్వల్ప వ్యవధిలోనే ఆందోళనలను చవిచూసింది. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సమర్పించేదాకా పరిస్థితులు వెళ్లాయి. ఓటర్ కార్డుల్లో అవకతవకలను రాహుల్ సహా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. రాజ్యసభలోనూ ఇదే విషయంపై చర్చకు పట్టుబడగా అధికారపక్షం నిరాకరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సాయంత్రంపూట రైల్వే సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ద్వారా ఆమోదం లభించింది. గతేడాది డిసెంబర్ 11న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాకు సంబంధించి కీలకమైన లేడింగ్ బిల్లు 2024ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది.
విద్యార్థుల భవిత పట్టదా?: కేంద్రం ఆగ్రహం
లోక్‌సభలో కొశ్చన్ అవర్‌లో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు న్యాయంగా దక్కాల్సిన పన్ను రాబడిలో వాటా, సమగ్రశిక్షా అభియాన్ సహా ఎడ్యుకేషన్ ఫండ్స్ ఎప్పుడు విడుదల చేస్తారని, ఎన్‌ఈపీని అమలు చేయనందుకు అందుకు ప్రతీకారంగా ఈ నిధుల విడుదల జాప్యం న్యాయమేనా? అని డీఎంకే ఎంపీ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వంపై, ద్రవిడ ఎంపీలపై విరుచుకుపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా ప్రతిపక్ష రాష్ట్రాలూ అంగీకరించాయని, పీఎం శ్రీ స్కీమ్‌నూ అమలు చేస్తున్నాయని వివరించారు. డీఎంకే ప్రభుత్వం కూడా తొలుత ఎన్‌ఈపీని అంగీకరించిందని, ఆ తర్వాత భాషా రాజకీయాలు చేస్తూ యూటర్న్ తీసుకున్నదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ను గందరగోళంలోకి నెడుతున్నారని, కేవలం భాషా రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని, భాషా విభేదాలు పెంచుతున్నదని మండిపడ్డారు. డీఎంకే చట్టసభ్యులు అప్రజాస్వామికంగా, అనాగరికంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్‌ఈపీని అమలు చేయడానికి ఇంకా 20 రోజుల సమయమున్నదని, కేంద్రం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో డీఎంకే ఎంపీలు మండిపడ్డారు. దీంతో సభ వాయిదా పడింది.
ప్రధాని సమర్థిస్తారా?: డీఎంకే ఫైర్
కేంద్రమంత్రి తమతోపాటు తమిళనాడు ప్రజలనూ అవమానించారని, ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ కూడా సమర్థిస్తున్నారా? అని డీఎంకే ఎంపీలు ప్రశ్నించారు. తామెప్పుడూ నిజాయితీగానే ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని కేంద్రమంత్రి తెలుపడంతో స్పీకర్ ఓం బిర్లా ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు. అనంతరం, కేంద్రమంత్రి ప్రధాన్ సభా హక్కులను ఉల్లంఘించారని డీఎంకే ఎంపీ కనిమొళి తీర్మానం సమర్పించారు. కేంద్రమంత్రి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారని, తమనే తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారని కనిమొళి ఆగ్రహించారు. అప్రజాస్వామిక, అనాగరిక, నిజాయితీలేమి, తప్పుదోవ పట్టిస్తున్నారనే పదాలను తమపై ప్రయోగించారని, అవి తమిళనాడు ప్రజలపైనా ప్రయోగించినట్టేనని పేర్కొ్న్నారు. కేంద్రమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను స్పీకర్‌కు సమర్పించారు.
ఫేక్ ఓటర్లపై ఆందోళన
అనంతరం, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫేక్ ఓటర్ల అంశాన్ని లేవనెత్తారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ నకిలీ ఓట్లపై ఆందోళన చెందుతున్నాయని, మహారాష్ట్ర అసెంబ్లీకి ముందు అనూహ్యంగా పెరిగిన ఓటర్లపై ఇదివరకే తాము అనుమానాలు వ్యక్తం చేశామని, ఫొటో ఐడీలతో ఎక్సెల్ షీట్ ఇంకా తమకే రాలేదని వివరించారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం కూడా ఎపిక్ నెంబర్లలో తప్పులను లేవనెత్తిందని, ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చకు ఖర్గే సారథ్యంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. డీలిమిటేషన్ పైనా ఆందోళనలు చేశాయి. రూల్ 267 కింద తనకు పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు నోటీసులు పంపుతూనే ఉన్నాయని, ఇది సభల సమగ్రతను దెబ్బతీసే ప్రతిపక్షాలు కుట్రేనని జేపీ నడ్డా మండిపడ్డారు. ఈ నోటీసులను తిరస్కరిస్తే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వాదించడమో వాకౌట్ చేయడమో చేస్తూ తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్రలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆగ్రహించారు. నకిలీ ఓటర్ల అంశంపై చర్చకు నిరాకరించడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
రూ. 51 కోట్ల అదనపు కేటాయింపులు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(మార్చి 31తో ముగియనున్న)లో అదనంగా రూ. 51,463 కోట్లు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమ్మతి కోసం విజ్ఞప్తి చేసింది. ఇందులో 5,320 కోట్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు, వీటి నెట్‌వర్క్ ఆధునికీకరణలకు కేటాయించాలని, ప్రతిపాదిత కొత్త యూపీఎస్ కోసం అదనంగా రూ. 7000 కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేటాయింపుల కోసం పలు శాఖల్లో వినియోగించకుండా మిగిలిన నిధులను మళ్లించనుంది. మణిపూర్‌పై రాష్ట్రపతిపాలనను లోక్‌సభ ఆమోదించాల్సి ఉన్నది. ఈ అంశంపై గంటపాటు చర్చ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మణిపూర్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టగా నేడు దీనిపై చర్చించనున్నారు.
రైల్వే సవరణ బిల్లు
కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ ద్వారా రైల్వే బోర్డును తమ గుప్పిట్లోకి తీసుకోవాలని భావిస్తున్నదని, పార్లమెంటరీ ప్యానెల్ సమీక్షకు కేంద్రం నిరాకరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1989 రైల్వే చట్టంలో రైల్వే బోర్డును చేర్చడం ద్వారా బోర్డు సభ్యులు, చైర్మన్, వారి ఎంపిక, ఎంపిక అర్హతల నిర్ణయం, పదవీకాలం వంటివన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లుతాయని పేర్కొన్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు ఎలాంటి కోత లేదని, ప్రస్తుతమున్న చట్టాలను సరళతరం మాత్రమే ఈ సవరణ చేస్తున్నదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. వికేంద్రీకరణనూ ఇది ప్రోత్సహిస్తు్న్నదన్నారు. ఎఫీషియెన్సీ పెంచడానికి, ఫీల్డ్ అధికారులను సాధికారులు చేయడం, పరస్పర సహాయక సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేలా ఈ బిల్లు రూపొందించినట్టు వివరించారు. ఈ బిల్లును రాజ్యసభలోనూ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి అంగీకారంతో చట్టంగా మారనుంది.
రాచరికం అనుకుంటున్నారా?: సీఎం స్టాలిన్
కేంద్రమంత్రి వ్యాఖ్యల తర్వాత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గతేడాది ఆగస్టులో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖను పోస్టు చేస్తూ.. అప్పుడు కూడా ఎన్‌ఈపీని, పీఎం శ్రీ స్కీమ్‌ను తమిళనాడు స్వీకరించడం లేదని స్పష్టంగా రాసింది కేంద్రమంత్రే కదా? అని ప్రశ్నించారు. తాము యూటర్న్ తీసుకున్నామనేది అవాస్తవ వాదన అని స్పష్టం చేశారు. తాము ఆ పథకాలను అమలు చేసే ప్రసక్తే లేదని, కేంద్రం తమకు అందించాల్సిన న్యాయబద్ధమైన నిధుల వాటాను అందిస్తారా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు.






