BREAKING: ఓటెత్తిన బెంగాల్, తమిళనాడు ప్రజలు.. రికార్డుస్థాయిలో పోలింగ్

by Naga Rani Yarlagadda |

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లు సత్తా చాటారు. సాయంత్రం 5 గంటల సమయానికి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

BREAKING: ఓటెత్తిన బెంగాల్, తమిళనాడు ప్రజలు.. రికార్డుస్థాయిలో పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గురువారం (ఏప్రిల్ 23, 2026) జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారీ స్థాయిలో నమోదైంది. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, బెంగాల్‌లో సగానికి పైగా స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.24 శాతం, బెంగాల్‌లో 3.6 కోట్ల మంది ఓటర్లకు గాను ఏకంగా 90 శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది.

గురువారం పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ కార్యకర్తల మధ్య పలు చోట్ల చెదురుమొదురు ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ, ఓటర్లు భారీగా తరలివచ్చారు. ముర్షిదాబాద్‌లో హుమాయున్ కబీర్‌కు చెందిన ఏజేయూపీ (AJUP), తృణమూల్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరగ్గా, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో ఒక బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో ప్రశాంతంగా పోలింగ్ సాగింది. అధికార డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోరు ఉండగా, నామినేషన్ల సమయంలో లక్షలాది మంది ఓటర్ల పేర్ల తొలగింపు అంశంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

జంగిల్ రాజ్ పాలనకు అంతం..

ముర్షిదాబాద్‌లో హుమాయున్ కబీర్ కాన్వాయ్‌ను టీఎంసీ మద్దతుదారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అలాగే కుమార్‌గంజ్ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై టీఎంసీ కార్యకర్తలు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల ఈవీఎంలపై బీజేపీ గుర్తుపై సిరా పూయడంతో పోలింగ్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. ఇదే సమయంలో నాడియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ 'జంగిల్ రాజ్' పాలన అంతం కాబోతోందని, భారీ పోలింగ్ బీజేపీ విజయాన్ని సూచిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

వారి గెలుపు ఓటములపైనే దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో ఈసారి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పరిపాలనకు ఈ ఎన్నికలను ఒక రెఫరెండంగా భావిస్తుండగా, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. అయితే.. అందరి దృష్టి స్టార్ హీరో విజయ్ పైన ఉంది. ఆయన తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నుండి పోటీ చేస్తూ తన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి, కోలత్తూర్‌లో ఎంకే స్టాలిన్, ఎడప్పాడిలో పళనిస్వామి వంటి దిగ్గజాల గెలుపోటములు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.

Next Story