‘మెట్రో చిక్స్’ పేరుతో మహిళల రహస్య వీడియోలు.. యువకుడిపై హైకోర్టు ఆగ్రహం

by Ramesh Naini |

బెంగళూరు మెట్రోలో ప్రయాణించే మహిళల వీడియోలను వారికి తెలియకుండా రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ కంటెంట్ క్రియేటర్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘మెట్రో చిక్స్’ పేరుతో మహిళల రహస్య వీడియోలు.. యువకుడిపై హైకోర్టు ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు మెట్రోలో ప్రయాణించే మహిళల వీడియోలను వారికి తెలియకుండా రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ కంటెంట్ క్రియేటర్‌పై కర్ణాటక హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మహిళలను ఎక్కడా ప్రశాంతంగా, సురక్షితంగా ఉండనివ్వరా?’ అంటూ జస్టిస్ ఎం. నాగప్రసన్న తీవ్రంగా మండిపడ్డారు. కేసు వివరాల్లోకి వెళితే.. బి.కె. దిగంత్ అనే అకౌంటెంట్ ‘మెట్రో చిక్స్’ (Metro Chicks) పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాలు నిర్వహించేవాడు. మెట్రోలో ప్రయాణించే మహిళల ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా తీసి అందులో అప్‌లోడ్ చేసేవాడు. ఈ ఖాతాలకు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉండగా, మహిళల దేహాకృతిపై అసభ్యకరమైన కామెంట్లు వచ్చేవి. దీనిపై గత ఏడాది మే నెలలో పోలీసులు దిగంత్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కోర్టులో విచారణ...

తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్లేసుల్లో ఉండే సీసీటీవీల తరహాలోనే తాను కూడా వీడియోలు తీశానని, ఇందులో ఎలాంటి నేరం లేదని వాదించాడు. ఈ వాదనపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలేంటి ఈ మెట్రో చిక్స్?’ మహిళల వెనుక నుంచి ఫోటోలు తీసి ఆన్‌లైన్‌లో పెడతావా? ఏంటీ నాన్సెన్స్?’ అని నిలదీశారు. అనుమతి లేకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని సీసీటీవీ ఫుటేజీతో పోల్చలేమని, ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారే ఫిర్యాదుదారుడు కాబట్టి కేసు చెల్లదంటూ సాంకేతిక కారణాలు చూపుతూ తప్పించుకోవాలని చూసిన నిందితుడి న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి కేసుల్లో సాంకేతికతల వెనుక దాక్కోవడం కుదరదని స్పష్టం చేస్తూ.. దిగంత్ పిటిషన్‌ను కొట్టివేసి, అతనిపై క్రిమినల్ చర్యలు కొనసాగించాల్సిందేనని తీర్పునిచ్చింది.

Next Story