- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిడ్మా చరిత్ర భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర.. మావోయిస్టు పార్టీ సంచలన స్టేట్‌మెంట్
వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులను సమూలంగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులను సమూలంగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని దండకారణ్య ప్రాంతాల్లో భద్రతా దళాలు జోరుగా కూబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి. అయితే, నవంబర్ 19న మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజేతో పాటు చాలామంది అగ్రనేతలు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే సమయంలో, ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా నిరసిస్తూ నిన్న (నవంబర్ 20) మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరిట సంచలన లేఖ విడుదలైంది. ఆ లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా, కామ్రేడ్ రాజే, శంకర్‌తో పాటు మరికొందరిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతి క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్ కథ అల్లారని ఆరోపించారు. ఈ క్రూర హత్యకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపుణిచ్చారు.
కార్పొరేట్ దోపిడీ కోసమే ఈ దమనకాండ..
దేశంలో ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దమనం చేస్తున్నారని అభయ్ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కార్పొరేట్ దోపిడీ కోసమే జరుగుతోందని ఆరోపించారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా తన సహచరులు కామ్రేడ్ రాజే, కొద్దిమందితో కలిసి చికిత్స కోసం విజయవాడకు వెళ్లారని, అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో కొందరి ద్రోహం వల్ల సమాచారం పోలీసులకు లీక్ అయిందని తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆంధ్ర ఎస్‌ఐబీ నవారు నవంబర్ 15న వారిని అదుపులోకి తీసుకొని క్రూరంగా హత్య చేసి, ఆ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని పచ్చి అబద్ధాలతో ప్రకటన చేశారని ఆరోపించారు. అమరులైన కామ్రేడ్ హిడ్మా, రాజే, శంకర్, చైతు, కమల, మల్లేశ్, దేవా మరియు ఇతరులకు సీపీఐ (మావోయిస్టు) పార్టీ శిరస్సు వంచి వినమ్రంగా రెడ్ సెల్యూట్ అర్పిస్తోందని, వారు కొనసాగించిన విప్లవ సాంప్రదాయాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని కేంద్ర కమిటీ శపథం చేస్తోందని పేర్కొన్నారు.
పార్టీలో వివిధ హోదాల్లో హిడ్మా సేవలు
కామ్రేడ్ హిడ్మా 1974లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పువర్తి గ్రామంలో పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నతనంలోనే ఉద్యమ రాజకీయాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్‌లో పూర్తికాల పార్టీ సభ్యుడిగా చేరాడు. 1998లో బస్తర్ దళంలో చేరి, 1999లో గడ్చిరోలీలో పనిచేశాడు. 2001లో ఏరియా కమిటీ సభ్యుడిగా, దక్షిణ బస్తర్‌లో, 2002లో ఊసూర్ ఎల్‌ఓఎస్ కమాండర్, కొత్తగూడెం ఎల్‌ఓఎస్ కమాండర్‌గా పనిచేశాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2006 నుంచి 2009 వరకు కంపెనీ-2, కంపెనీ-3 కమాండర్‌గా పనిచేశాడు. 2009లో బెటాలియన్ ఏర్పడిన తర్వాత బెటాలియన్ కమాండర్‌గా, 2011లో బీజేడీ కమిటీ కార్యదర్శిగా, అదే సంవత్సరం డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడిగా, 2020లో స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా, 2024 ఆగస్టులో ఎస్‌జెడ్‌సీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరించారు
కామ్రేడ్ హిడ్మా మొదటి నుంచి ప్రజల్లోనే పనిచేస్తూ, ప్రజల నుంచి నేర్చుకుంటూ అభివృద్ధి చెందాడు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజంపై విశేష అధ్యయనం చేసి రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదిగాడు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి అద్భుత ఫలితాలు సాధించాడు. అనేక మిలిటరీ చర్యలకు ప్రణాళికలు రచించి విజయవంతంగా అమలు చేశాడు. శత్రు బలగాల నుంచి వందల ఆయుధాలు స్వాధీనం చేసుకొని పీఎల్‌జీఏను బలోపేతం చేశాడు. హిడ్మా నాయకత్వంలో బెటాలియన్ శత్రు అధికారాన్ని ధ్వంసం చేసి దక్షిణ సబ్ జోన్‌లో జన రాజ్యాధికార అంగాలు (నయా సర్కార్లు) ఏర్పాటు చేసింది. కానీ కార్పొరేట్ మీడియా, గోదీ మేధావులు ఎప్పటి నుంచో హిడ్మాను దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారు. ఈ దుర్మార్గపు ప్రచారాలు ఎంత చేసినా ప్రజల హృదయాల్లో హిడ్మాకు గౌరవ స్థానం చెరగదని పార్టీ పేర్కొంది. భగత్ సింగ్, కొమురం భీమ్, గూండదండూర్, గండ సింగ్, అల్లూరి సీతారామరాజు చరిత్రలాగే హిడ్మా చరిత్ర కూడా భారత విప్లవోద్యమంలో చెరగని ముద్ర వేస్తుందని ప్రకటించింది.
ఎన్నికల కమిషన్ మోదీకి ‘గోదీ కమిషన్’గా మారింది
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రజల కష్టార్జితాన్ని అభివృద్ధి పేరుతో కార్పొరేట్లకు అప్పజెప్తున్నారని మావోయిస్టు పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చెలరేగుతున్నాయని, ఆ పోరాటాలను ఫాసిస్టులు దుర్మార్గంగా అణచివేస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల కమిషన్ మోదీకి ‘గోదీ కమిషన్’గా మారిపోయిందని, బీహార్ ఎన్నికల్లో భారీ స్థాయిలో మోసాలు చేసి విజయం సాధించారని లేఖలో ధ్వజమెత్తింది. హిడ్మా లాంటి సాటిలేని యోధుల చరిత్రను చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు, రైతాంగం, యువత, విద్యార్థులు, మేధావులు భాగస్వాములు కావాలని మావోయిస్టు పార్టీ లేఖ ద్వారా పిలుపునిచ్చింది.
మావోయిస్టు పార్టీ లేఖ: https://epaper.dishadaily.com/4084865/Dishaweb/22-11-2025#page/1/1






