అరుణాచలం సమీపంలో విషాదం.. హీలియం సిలిండర్ పేలి నలుగురు మృతి

by Naga Rani Yarlagadda |

పవిత్ర పుణ్యక్షేత్రమైన అరుణాచలం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మనలూర్ పేటలో హీలియం గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు.

అరుణాచలం సమీపంలో విషాదం.. హీలియం సిలిండర్ పేలి నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్నిలింగేశ్వరుడి సన్నిథి చుట్టూ గిరిప్రదక్షిణ చేసి.. శివయ్యను తనివితీరా దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు విచ్చేసే పుణ్యక్షేత్రమైన అరుణాచలం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మనలూర్ పేటలో సోమవారం సాయంత్రం హీలియం గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందగా.. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరువణ్ణామలై (అరుణాచలం) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చిన్నారులు ఉండగా.. ఇద్దరు చిన్నారులు కాళ్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో ఆరుగురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

కానుమ్ పొంగల్ సందర్భంగా ఆతు తిరువిళా జరుపుకునేందుకు వందలాదిమంది ప్రజలు తరలివచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో ఉత్సవ వేదిక వద్ద బెలూన్లను నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. మృతులను ఉత్తరప్రదేశ్ కు చెందినవారిగా గుర్తించారు. సిలిండర్ చిన్నదే అయినా.. ఒక్కసారిగా పేలడంతో దానికి దగ్గరగా ఉన్న సిబ్బంది తీవ్రంగా ప్రభావితమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పిల్లలు ఆడుకునే బెలూన్లలో నింపే హీలియం మండే స్వభావం కలిగింది కాదు. కానీ సిలిండర్లో పీడనం ఎక్కువ అవ్వడం వల్ల పేలి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Next Story