హర్మూజ్ జలసంధిలో మళ్లీ హైటెన్షన్.. రెండు ఇరాన్ నౌకలను సీజ్ చేసిన అమెరికా

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-28 02:35:40  IST  )

అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ చమురు ట్యాంకర్లను అమెరికా బలగాలు సీజ్ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

హర్మూజ్ జలసంధిలో మళ్లీ హైటెన్షన్.. రెండు ఇరాన్ నౌకలను సీజ్ చేసిన అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్‌ (Iran)కు చెందిన చమురు ట్యాంకర్లను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ జలాల్లో జరుగుతున్న సాయుధ దోపిడీ అంటూ టెహ్రాన్ మండిపడింది. అయితే, ఇరాన్ చమురును రవాణా చేస్తున్నాయన్న కారణంతో అమెరికా బలగాలు ‘మెజెస్టిక్ X’, ‘టిఫానీ’ అనే రెండు భారీ ట్యాంకర్లను హిందూ మహాసముద్రం (Indian Ocean)లో సీజ్ చేశాయి. వాటిలో సుమారు 1.9 మిలియన్ బారెళ్ల చమురు ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ చర్యను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రపంచం మళ్లీ సముద్రపు దొంగల (Pirates) కాలాన్ని చూస్తోందని అన్నారు. చట్టపరమైన వారెంట్ల పేరుతో అమెరికా బహిరంగంగా దోపిడీకి పాల్పడుతోందని ఫైర్ అయ్యారు.. ఇది పైరసీని చట్టబద్ధం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారెంట్ల ఆధారంగానే సీజ్.. అమెరికా

మరోవైపు నౌకల సీజ్‌ను అమెరికా అధికారులు సమర్థించుకున్నారు. కోర్టు ఆమోదించిన వారెంట్ల ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించామని స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ధిక్కరించి చమురు విక్రయించడం ద్వారా లభించే ఆదాయం ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్లకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా వెల్లడించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఈ పరిణామాల వల్ల యుద్ధ వాతావరణం నెలకొంది. చమురు ధరలపై దీని ప్రభావం పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story