భారీ వర్షాలు.. మెట్రో కోచుల్లోకి నీళ్లు, రెడ్ అలర్ట్ జారీ

by Naga Rani Yarlagadda |

నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ముంబై, థానే, రాయ్ గఢ్ లకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుర్లా, సియాన్, దాదర్, పరేల్ వంటి ప్రాంతాలు వర్షపునీటిలో మునిగిపోయాయి.

భారీ వర్షాలు.. మెట్రో కోచుల్లోకి నీళ్లు, రెడ్ అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు ముంబైని (Mumbai Heavy Rains అతలాకుతలం చేశాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా కురుస్తున్న వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని వణికిపోయింది. నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లు జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డును బ్రేక్ చేసేలా కురిసిన వర్షానికి మెట్రో సర్వీసులు, రైళ్లు, విమాన సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ముంబై, థానే, రాయ్ గఢ్ లకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుర్లా, సియాన్, దాదర్, పరేల్ వంటి ప్రాంతాలు వర్షపునీటిలో మునిగిపోయాయి. రోడ్లపైనుంచి వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవలే ప్రారంభమైన ఆచార్య ఆత్రే చౌక్ భూగర్భ మెట్రోస్టేషన్ నీట మునిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆచార్య ఆత్రే చౌక్, వర్లి స్టేషన్ల మధ్య రైలు సర్వీసుల్ని నిలిపివేయడంతో పలువురు ప్రయాణికులు స్టేషన్లలోనే చిక్కుకున్నారు. మెట్రోకోచ్ ల్లోకి నీళ్లు రావడంతో ఎస్కలేటర్లను కూడా మూసివేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింగ్స్ సర్కిల్, మంత్రాలయ, దాదర్ టీటీ ఈస్ట్, పరేల్ టీటీ, కలచౌకి, వాడాలా, హింద్ మాతా, కెంప్స్ కార్నర్, చర్చిగేట్, చించ్పోకలి, దాదర్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కేరళ, కర్ణాటకల్లోనూ భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Next Story