- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాశ్మీర్ లోయలో భారీ మంచు వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం
శుక్రవారం కాశ్మీర్ లోయ అంతటా కురిసిన మంచు వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం కాశ్మీర్ లోయ అంతటా కురిసిన మంచు వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీనగర్‌కు వచ్చే, వెళ్లే పలు విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా తాము ప్రయాణించాల్సిన ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించి తాజా విమాన స్థితిని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు శ్రీనగర్ విమానాశ్రయం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పేర్కొంది. ప్రస్తుతం రన్‌వేల్లో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయని తెలిపింది.
మంచు వర్షం కారణంగా శ్రీనగర్‌లో టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేశామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ప్రయాణికులు విమానంలోలేదా భూమిపై ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చని హెచ్చరించింది. అనుమతి లభించిన వెంటనే బయలుదేరేందుకు ముందుగానే బోర్డింగ్ ప్రక్రియ పూర్తిచేయవచ్చని కూడా తెలిపింది. స్పైస్‌జెట్ కూడా శ్రీనగర్‌కు సంబంధించిన అన్ని రాకపోకలు, అనుబంధ విమానాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రయాణికులు తరచూ తమ విమాన స్థితిని పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా, భారీగా మంచు పేరుకుపోవడంతో కాశ్మీర్ లోయలోని కీలక జాతీయ రహదారులు, పర్వత మార్గాలను అధికారులు, పోలీసులు మూసివేశారు. నవ్ యుగ్ టన్నెల్ సమీపంలో జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేయగా.. ముఘల్ రోడ్, సిన్తాన్ రోడ్‌లలో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. “రామ్‌సూ వరకు మంచు పేరుకుపోవడం, మంచు వర్షం కురుస్తుండటంతో రోడ్లు జారే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో ఎన్‌హెచ్–44పై వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేశాం” అని జమ్మూ–కాశ్మీర్ ట్రాఫిక్ పోలీస్ వెల్లడించింది.
గుల్మర్గ్ స్కీ రిసార్ట్‌తో పాటు కుప్వారా, బారాముల్లా, షోపియాన్ జిల్లాల ఎత్తైన ప్రాంతాల్లో మంచు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. గురువారం శ్రీనగర్ సహా లోయ మైదాన ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు వీచడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.






