- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రైల్వే ట్రాకులపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన 20 సెంటీమీటర్ల వర్షానికి నగరమంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తోన్న భారీ వర్షానికి అంధేరీ, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్ వంటి కీలక ప్రాంతాలతో పాటు దాదర్ రైల్వే స్టేషన్ ట్రాకులు సైతం జలమయం కావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు స్టేషన్లలోనే పడిగాపులు పడుతున్నారు. రోడ్లపై కూడా భారీగా వరదనీరు చేరగా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భారీ వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా ఈస్టర్న్ సబర్బ్స్ పరిధిలోని ములుండ్ మిథానగర్ మున్సిపల్ స్కూల్ ప్రాంతంలో అత్యధికంగా 23.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మాన్ ఖుర్డ్ ఫైర్ స్టేషన్ వద్ద 22.86 సెంటీమీటర్లు, శాంతాక్రజ్ వర్క్ షాప్ వద్ద 22.34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
రానున్న మరికొద్దిగంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్ గఢ్ జిల్లాలకు ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బలహీనమైన కట్టడాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, లోతట్టు, ఎక్కువగా నీరు నిలిచిఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త నరేష్ యాదవ్ తెలిపారు. రానున్న నాలుగైదు రోజుల్లో కొంకణ్ తీరం, గోవా, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఒడిశా సహా మధ్య భారతదేశంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.






