చలికాలంలో భారీ వర్షాలు: ఆరు జిల్లాలకు 'రెడ్ అలర్ట్'..విద్యాసంస్థలకు సెలవులు

by Malleboina Mahesh |

వరుస తుఫానులు, వాయుగుండాలు, ఉపరితల ఆవర్తనాలతో తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చలికాలంలో భారీ వర్షాలు: ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..విద్యాసంస్థలకు సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్: వరుస తుఫానులు, వాయుగుండాలు, ఉపరితల ఆవర్తనాలతో తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ముఖ్యంగా తంజావూరు, తిరువారూర్‌, మైలాడుదురై, విల్లుపురం, కడలూరు, కళ్లకురుచ్చి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా, కడలూరు, కళ్లకురుచ్చి జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు (స్కూళ్లు, కాలేజీలు) ఈ రోజు సెలవు ప్రకటించారు. పొరుగు ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకాల్‌లో కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తంజావూరు, తిరువారూర్‌ జిల్లాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముఖ్యంగా తూత్తుకుడి జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF బృందాలను రంగంలోకి దించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story