ఆకస్మిక వరదలు.. 32 మంది మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-28 22:45:53  IST  )

పాకిస్తాన్‌లో మాన్సూన్‌ సీజన్‌ ప్రారంభమైన ఈ వారం నుంచే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.

ఆకస్మిక వరదలు.. 32 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో మాన్సూన్‌ సీజన్‌ ప్రారంభమైన ఈ వారం నుంచే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 16 మంది చిన్నారులు ఉన్నారు అని సంబంధిత విపత్తు నిర్వహణ సంస్థలు వెల్లడించాయి.

గత 36 గంటల్లో కైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలోనే ఫ్లాష్ ఫ్లడ్స్, గదుల పైకప్పులు కూలిన ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. మొత్తం మరణాల్లో 13 మంది ఉత్తర పశ్చిమంలో ఉన్న స్వాత్ వ్యాలీ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు తెలిపారు. మరోవైపు పంజాబ్‌ ప్రావిన్స్‌లో బుధవారం నుంచి ఇప్పటివరకు కనీసం 13 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. కూలిన గోడలు, పైకప్పుల కారణంగా ఈ విషాదకర ఘటనలు జరిగాయి.

కైబర్ పఖ్తున్ ఖ్వాలో 56 ఇళ్లు తీవ్రంగా దెబ్బతినగా, వాటిలో 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా వచ్చే మంగళవారం వరకు భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రమాదం కొనసాగుతుందని పాకిస్తాన్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా.. గత నెలలో కూడా పాకిస్తాన్‌లో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో కనీసం 32 మంది మరణించారు. వసంతకాలం నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో అనేక తీవ్ర వాతావరణ మార్పులు, గాలివానలు, పెద్దమొత్తంలో వడగళ్ల వర్షాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు అత్యంత ప్రభావితమైన దేశాలలో పాకిస్తాన్‌ ఒకటిగా మారింది. సుమారు 240 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం తరచూ తీవ్రమైన వాతావరణ పరిణామాలను ఎదుర్కొంటోంది.

Next Story