Hazaribag: శివరాత్రి వేళ జార్ఖండ్‌లో అల్లర్లు.. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత

by B.Srinivas |

మహాశివరాత్రి సందర్భంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Hazaribag: శివరాత్రి వేళ జార్ఖండ్‌లో అల్లర్లు.. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా జార్ఖండ్‌ (Jharkhand)లోని హజారీబాగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం దుండగులు పలు దుకాణాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఇచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రాన్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఓ పాఠశాల ముందు మతపరమైన జెండాలు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడాన్ని ఒక వర్గం వ్యతిరేకించడంతో ఘర్షణ ప్రారంభమైనట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.

ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ స్పందించారు. హింసకు బంగ్లాదేశ్ చొరబాటుదారులే కారణమని ఆరోపించారు. వారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి చర్యలు తీసుకోవాలని సీఎం హేమంత్ సోరెన్ కు విజ్క్షప్తి చేశారు. ‘హోలీ, సరస్వతి పూజ, రామనవమి, మహా శివరాత్రి ఏ ఉత్సవం అయినా జార్ఖండ్‌లో మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎందుకు పునరావృతమవుతాయి? ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబడినవారు ఇక్కడ మత సామరస్యాన్ని, శాంతిభద్రతలను నాశనం చేయాలని, రాష్ట్ర జనాభాను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని తెలిపారు. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఈ ఘటనలు అరుదుగా జరుగుతాయని ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో చొరబాటుదారులను ఎప్పటికప్పుడు ఏరివేస్తారని తెలిపారు.

Next Story