IMF: పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ ప్రయత్నాలు

by Shamantha N |   (  Updated:2025-05-06 09:36:47  IST  )

పాకిస్థాన్‌ ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా భారత్ చర్యలు చేపట్టింది. కాగా.. ఆర్థిక చర్యల కార్యదళం (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌)లో కూడా పాక్‌ను తిరిగి ‘గ్రే లిస్ట్‌’లోకి చేర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది.

IMF: పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు భారత్ ప్రయత్నాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌ ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా భారత్ చర్యలు చేపట్టింది. కాగా.. ఆర్థిక చర్యల కార్యదళం (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌)లో కూడా పాక్‌ను తిరిగి ‘గ్రే లిస్ట్‌’లోకి చేర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఐఎంఎఫ్‌ నిధుల కోసం పాక్‌ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బకొట్టాలంటే ఎఫ్‌ఏటీఎఫ్‌ చర్యలే కీలకంగా మారాయి. ఈసారి ఎఫ్‌ఏటీఎఫ్‌ భేటీలో పాక్‌పై నిఘాను పెంచాలన్న ప్రతిపాదన భారత్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పాక్‌కు ఆర్థిక ప్యాకేజీ పై ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) బోర్డ్‌ సమావేశంలో కూడా భారత్‌ ఈ అంశాన్ని లేవనెత్తనుంది. పహెల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడాన్ని భారత్‌ వ్యతిరేకించనుంది. ‘‘ఐఎంఎఫ్‌ బోర్డు, ఎఫ్‌ఏటీఎఫ్‌ ఎదుట పెట్టేందుకు ఇప్పటికే ఆధారాలు సేకరించాము. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు వెళ్లకూడదన్న అంశంపై భారత్‌ గట్టిగా నిలబడనుంది’’ అని ఓ అధికారి వెల్లడించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమీక్ష సమయానికి మూడు దేశాలు బ్లాక్‌లిస్ట్‌లో, 25 దేశాలు గ్రేలిస్ట్‌లో ఉన్నాయి.

భారత్ ను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు

కాగా.. గ్రే లిస్ట్ జాబితాలోనే కొన్నేళ్లపాటు ఉన్న తర్వాత పాక్‌ 2022లో బయటపడింది. అప్పట్లో మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్స్‌ను అడ్డుకోవడానికి తీసుకొంటున్న చర్యలను చూపించి ఊరట పొందింది. భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి పాక్‌ టెర్రర్‌ ఫైనాన్సింగ్‌, మనీలాండరింగ్‌కు సహకరించిందన్న ఆధారాలు భారత్‌ వద్ద ఉన్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌లో గతంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. వాటిని ప్రపంచ వేదికపై అవసరమైనప్పుడు బయటపెట్టాలన్నారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో భారత్‌ సభ్యదేశం కావడం గమనార్హం.

Read More: IND PAK War: భారత్‌తో యుద్ధంపై పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్

Next Story