Harvard: హార్వర్డ్ యూనివర్శిటీకి 24 గంటల్లో 1.14 మిలియన్ డాలర్ల విరాళాలు

by S Gopi |

గతేడాది ఏప్రిల్‌లో హార్వర్డ్ రోజువారీ సగటున అందుకున్న విరాళాల కంటే 40 రెట్లు ఎక్కువ.

Harvard: హార్వర్డ్ యూనివర్శిటీకి 24 గంటల్లో 1.14 మిలియన్ డాలర్ల విరాళాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో ఆ దేశంలోని విదేశీ విద్యార్థులతో పాటు అక్కడి యూనివర్సిటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వం గ్రాంట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో యూనివర్సిటీలు ఆర్థికంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హార్వార్డ్ యూనివర్శిటీకి ట్రంప్ ప్రభుత్వం నిధులను నిలిపేస్తామని ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్టు హార్వర్డ్ ప్రెసిడెంట్ అలాన్ ఎం గార్బర్ ప్రకటించిన 24 గంటల వ్యవధిలో యూనివర్సిటీకి 4,000 విరాళాలు అందాయి. వాటి మొత్తం 1.14 మిలియన్ డాలర్లు అని హార్వర్డ్ క్రిమ్సన్‌లోని ఓ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, ఈ మొత్తం గతేడాది ఏప్రిల్‌లో హార్వర్డ్ రోజువారీ సగటున అందుకున్న విరాళాల కంటే 40 రెట్లు ఎక్కువ. ట్రంప్ ప్రభుత్వం సోమవారం 2.2 బిలియన్ డాలర్ల నిధుల కోత ప్రకటించిన తర్వాత అత్యధిక సంఖ్యలో విరాళాలు వచ్చాయి. ప్రకటన వెలువడిన తర్వాతి నాలుగు గంటల్లో హార్వర్డ్ యూనివర్శిటీ దాదాపు 1,000 ఆన్‌లైన్ విరాళాలను అందుకుంది. అంతేకాకుండా యూనివర్శిటీకి ఉన్న పన్ను మినహాయింపు స్టేటస్‌ను తొలగించే సంకేతాలను కూడా ట్రంప్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిర్ణయం కూడా యూనివర్శిటీకి ఈ స్థాయిలో విరాళాలు వచ్చేందుకు కారణం.

Next Story