ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో వైరస్.. క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు మృతి

by Naga Rani Yarlagadda |

ప్రపంచాన్ని ఇప్పుడు మరో వైరస్ వణికిస్తోంది. క్రూయిజ్ షిప్పులో ఈ వైరస్ బారిన పడి ముగ్గురు మరణించగా.. 149 మందికి పాజిటివ్ గా తేలింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో వైరస్.. క్రూయిజ్ షిప్‌లో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ తర్వాత.. ఇప్పడు ప్రపంచాన్ని మరోవైరస్ కలవరపెడుతోంది. అర్జెంటీనా నుంచి బయలుదేరిన 'ఎంవీ హోండియస్' (MV Hondius) అనే లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ (Hantavirus) ప్రబలడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 149 మంది ప్రయాణికులు ఉన్న ఈ ఓడలో వైరస్ కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మందికి ఇన్ఫెక్షన్ సోకింది. బాధితుల్లో ఒకరు 69 ఏళ్ల డచ్ మహిళగా గుర్తించారు. ఈ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కరోనా లాంటి మహమ్మారి కాదు: డబ్ల్యూహెచ్‌ఓ

ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. ఇది కోవిడ్-19 లాంటి మహమ్మారి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హంటా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుందని, అయితే మనుషుల మధ్య కూడా ఇది సంక్రమించే అవకాశం ఉందని (Human-to-human transmission) ఈ ఘటన ద్వారా మొదటిసారిగా ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి మాత్రమే ఇది వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

లాటిన్ అమెరికాకు చెందిన 'ఆండీస్' వేరియంట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ గెబ్రియేసస్ మాట్లాడుతూ.. ఈ వ్యాప్తికి 'ఆండీస్ వైరస్' (Andes virus) కారణమని, ఇది ప్రధానంగా లాటిన్ అమెరికాలో కనిపిస్తుందని తెలిపారు. దీని ఇన్‌క్యూబేషన్ పీరియడ్ (వైరస్ లక్షణాలు బయటపడే సమయం) దాదాపు ఆరు వారాల వరకు ఉండవచ్చని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఓడలో ప్రయాణించిన వారు బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలకు విమానాల్లో తిరిగి వెళ్లడంతో, ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ నిర్ధారణ కోసం అర్జెంటీనా నుంచి సుమారు 2,500 డయాగ్నస్టిక్ కిట్‌లను ప్రభావిత దేశాలకు పంపిస్తున్నట్లు WHO వెల్లడించింది. ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇది విస్తరించకుండా అడ్డుకోవచ్చని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఓడలోని ప్రయాణికులందరూ మాస్కులు ధరించాలని, బాధితులకు చికిత్స అందించే సిబ్బంది మెరుగైన పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది. కెనడా, జర్మనీ, సింగపూర్, యూకే, యూఎస్ఏ వంటి 12 దేశాలలో నిఘాను పెంచినట్లు గెబ్రియేసస్ ధృవీకరించారు. గత నెలలో అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌక, మారుమూల వన్యప్రాణుల ప్రాంతాలలో ఆగడం వల్లే ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Next Story