బడ్జెట్ ముందు హాల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-25 05:28:48  IST  )

2025-26 కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైంది.

బడ్జెట్ ముందు హాల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారు?
X

దిశ, వెబ్ డెస్క్: 2025-26 కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రవేశపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా బడ్జెట్‌కు ముందు సంప్రదాయంగా నిర్వహించే హాల్వా వేడుక ఈనెల 24న ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయితే, బడ్జెట్‌కు ఈ హాల్వా వేడుక ఎందుకు నిర్వహిస్తారో, దాని ప్రాముఖ్యత ఏంటో చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఈ హల్వా వేడుకను కచ్చితంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో తెలియదు. కానీ దాదాపు 1950ల్లోనే ఇది ప్రారంభమైనట్లు భావిస్తున్నారు.

హాల్వా వేడుక ప్రాముఖ్యత

మొదట్లో రాష్ట్రపతి భవన్‌లోనే బడ్జెట్(Union Budget) ప్రతులను ముద్రించేవారు. కానీ 1950లో బడ్జెట్లోని అధిక భాగం లీక్‌ తర్వాత బడ్జెట్ ముద్రణను మింటో రోడ్​లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. అక్కడి నుంచి తిరిగి 1980లో నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌కు మార్చారు. దాని తరువాత లాక్ ఇన్​ వ్యవధిని కూడా ప్రవేశపెట్టారు. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో దానిని ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి వీలుండదు. వారు ఎల్లప్పుడూ సీసీటీవీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోల నిరంతర పర్యవేక్షణలో ఉంటారు. బడ్జెట్ పత్రాలు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన తర్వాత మాత్రం వాళ్లను బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. బడ్జెట్ గోప్యతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే ముద్రణ పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నం కావడానికి ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయడం ఆచారంగా వస్తోంది.

పెద్ద కడాయిలో ఈ హల్వాను తయారు చేస్తారు. ఆర్థికమంత్రి కడాయిని వెలిగించి హల్వా తయారీ ప్రక్రియకు శ్రీకారం చుడతారు. హల్వా రెడీ అయిన తర్వాత కడాయిని కదిలించి, బడ్జెట్ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ వడ్డిస్తారు. హల్వా వేడుక తర్వాత, బడ్జెట్‌ను ప్రధానమంత్రి దగ్గరికి పంపిస్తారు. ఆయన ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ పత్రాలను ముద్రణకు పంపుతారు. ఈ బడ్జెట్ పత్రాల ముద్రణ చాలా పకడ్బందీగా కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా నీడలో ఆర్థిక మంత్రిత్వ శాఖ బేస్‌మెంట్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌‌లో వీటిని ముద్రిస్తారు.

బడ్జెట్‌ ఎప్పుడంటే?

2025-26 కేంద్ర బడ్జెట్‌ను(Union Budget 2025) ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్‌. జులైలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు, తాయిలాలు, రాయితీలు ఉంటాయోనని దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు పన్ను రేట్లు, శ్లాబుల్లో ఏమైనా సడలింపులు ఉంటాయా అని వేచి చూస్తున్నారు.

ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది వీరే!

ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం పి.చిదంబరం 9, ప్రణబ్​ ముఖర్జీ 8, సీడీ దేశ్​ముఖ్​ 7, డాక్టర్ మన్మోహన్ సింగ్​ 6, టీటీ కృష్ణమాచారి 6 సార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె నిలవనున్నారు.

Next Story