యుద్ధం ఎఫెక్ట్.. LPG తర్వాత పెట్రోల్ ధరల పెంపుపై ప్రభుత్వ వర్గాల క్లారిటీ

by Prasad Jukanti |

యుద్ధం నేపథ్యంలో భారత్ లో ఇప్పటికే ఎల్పీజీ ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్ ధరలు టెన్షన్ పెట్టిస్తున్నాయి.

యుద్ధం ఎఫెక్ట్.. LPG తర్వాత పెట్రోల్ ధరల పెంపుపై ప్రభుత్వ వర్గాల క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనలోకి నెట్టుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ఆయా రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. యుద్ధం పరిస్థితుల వేళ దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగగా ఇక పెట్రోల్, డీజీల్ వంటి ఇంధన ధరలు సైతం పెరుగుతాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పరిస్థితి మెరుగుపడుతున్నందున ప్రభుత్వానికి మరింత నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. హార్ముజ్ మార్గం కాకుండా ఇతర దేశాల నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను పెంచిందని ఇప్పటి వరకు 60 శాతం ముడి చమురు దిగుమతులు హార్ముజ్ జల సంధి మార్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా, ఇప్పుడు అది 70 శాతానికి పెరిగిందని పేర్కొన్నాయి.

ఇంధనంపై పెంపు లేదు:

ఎల్పీజీ ధరల పెంపుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని మాత్రమే చెప్పాం. అది ఎల్పీజీకి సంబంధించి కాదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని స్పష్టం చేశాయి. కాగా వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్‍పీజీ సిలిండర్ పై రూ. 60, కమర్షియల్ సిలిండర్ పై రూ. 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు పంపిణీ చేసే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ పెంపుతో హైదరాబాద్‍లో ఎల్‍పీజీ సిలిండర్ ధర రూ. 965 కు చేరింది. ఈ పెంపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఇవ్వకుండా ఇప్పుడు రేట్ల పెంపుతో పీడిస్తున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, ఎరువుల కొరతను తీర్చలేని మోడీ ప్రభుత్వం అన్నీ బాగున్నాయంటూ ప్రగల్భాలు పలుకుతోందని 'ఎక్స్' వేదికగా విమర్శలు గుప్పించారు.

Next Story