- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెలు కాదు! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు.. ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్
కర్ణాటకలో ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గొర్రెలు, మేకల మాదిరిగా గూడ్స్ వాహనాల్లో తరలించి స్టడీ టూర్‌కు తీసుకెళ్లడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఒక ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి అమానుషంగా వ్యవహరించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను గొర్రెలు, మేకల మాదిరిగా గూడ్స్ వాహనాల్లో తరలించి స్టడీ టూర్‌కు తీసుకెళ్లడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని బలంజే ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఇన్-చార్జ్ హెడ్ మాస్టర్ కిరణ్, ఫిబ్రవరి 9న విద్యార్థుల కోసం ఒక స్టడీ టూర్ ఏర్పాటు చేశారు. నల్కూర్ సమీపంలోని ఒక తేనెటీగల పెంపకం కేంద్రాన్ని సందర్శించేందుకు విద్యార్థులను తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే, కనీస భద్రతా ప్రమాణాలను విస్మరించి, పిల్లలను బస్సులో కాకుండా ఒక ఓపెన్ పికప్ ట్రక్, ఒక టిప్పర్ (గూడ్స్ వాహనం) లో ఎక్కించి తీసుకెళ్లారు.
గూడ్స్ వాహనాల్లో నిలబడి ప్రయాణం
విద్యార్థులు ఆ గూడ్స్ వాహనాల్లో నిలబడి ప్రయాణిస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కదా అని వారిని గొర్రెల్లా చూస్తారా?’ అంటూ నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి, చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ కఠిన చర్యలు..!
ఈ ఘటనపై కర్ణాటక విద్యాశాఖ వెంటనే స్పందించింది. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) నుండి ప్రాథమిక నివేదికను కోరిన అధికారులు, హెడ్ మాస్టర్ కిరణ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం. తుది నివేదిక ఆధారంగా మరింత కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’ అని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా తెలిపింది.






