RCB: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు

by Shamantha N |

బెంగళూరు తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటనపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. భద్రతా కారణాలతో పరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది.

RCB: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటనపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. భద్రతా కారణాలతో పరేడ్ వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్లేయర్స్ ను సత్కరించాలనుకుంటే ఆదివారం ఓ చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ‘‘బుధవారం విజయోత్సవాలు వద్దని ఆర్సీబీ, ప్రభుత్వానికి మంగళవారం రాత్రి నుంచే సూచించాం. ప్రస్తుతం అభిమానులు ఉద్వేగంగా ఉన్నారని, అదికాస్త చల్లబడిన తర్వాత ఆదివారం కార్యక్రమం పెట్టుకోవాలని సిఫారసు చేశాం. ఎలాంటి ర్యాలీ వద్దని ఒక ప్రాంతానికే పరిమితమైన వేడుక నిర్వహించాలని చెప్పాం’’ అని ఓ పోలీసు అధికారిని చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఆందోళనలను ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసినప్పటికీ, పరిపాలన మొండిగా ఉందని.. మరుసటి రోజే వేడుకను నిర్వహించేందుకు రెడీ అయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ప్లేయర్లు ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు అప్పటివరకు ఉండరని నిర్వాహకులు వెల్లడించినట్లు ఆ అధికారి తెలిపారు.

కర్ణాటక హోంమంత్రి ఏమన్నారంటే?

మరోవైపు, కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని, దానికి తగ్గట్టుగానే అనుమతులు ఇచ్చామని అన్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ఉంటుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారన్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆర్సీబీ, క్రికెట్ సంఘం నిర్వహించాయని చెప్పారు. బెంగళూరు జట్టు కావడంతో తాము కూడా వేడుకలో భాగం కావాలని భావించామన్నారు. వేడుకల కోసం వారే జట్టును బెంగళూరుకు తీసుకువచ్చారన్నారు. విజయోత్సవాలకు ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదన్నారు. స్టేడియంలో కూర్చొనేంతమంది లేదా ఇంకాస్త ఎక్కువమంది మాత్రమే వస్తారని అనుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. కాగా.. కాగా.. బుధవారం కర్ణాటకలో దిగిన ఆర్సీబీ జట్టుకు విధానసౌధలో సన్మానం జరిగింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టు సభ్యులను సన్మానించారు. క్రికెట్‌ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. స్టేడియం సామర్థ్యం 35 వేల మంది మాత్రమే. కానీ, అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనక గేటు వద్ద తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగింది. ఆ ప్రమాదంలో 11 మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి.

కర్ణాటక బీజేపీ చీఫ్ ఏమన్నారంటే?

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు. దాని వెనుక ఉన్న ఆవశ్యకతను ప్రశ్నించారు. “ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇంత తొందర ఏమిటి? వేరే ఎవరైనా ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ర్యాలీని 3 నుండి 7 రోజుల తర్వాత ఈజీగా నిర్వహించవచ్చు" అని విమర్శించారు. బీజేపీ నేత ఆర్. అశోక కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తొందరపడటాన్ని ప్రశ్నించారు. "ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమం తర్వాత నిర్వహిస్తే ఏమయ్యేది? వారు ఎందుకు అంత తొందరపడ్డారు? ఇది 'బ్రాండ్ బెంగళూరు' కాదు, ఇది బెంగళూరు మరణం." అని మండిపడ్డారు.

Next Story