Goods train: అనంతనాగ్‌కు తొలి గూడ్స్ రైలు.. కశ్మీర్ చరిత్రలోనే తొలిసారి

by B.Srinivas |

జమ్మూకశ్మీర్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఓ గూడ్స్ రైలు కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చేరుకుంది.

Goods train: అనంతనాగ్‌కు తొలి గూడ్స్ రైలు.. కశ్మీర్ చరిత్రలోనే తొలిసారి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా ఓ గూడ్స్ రైలు కశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చేరుకుంది. ఈ రైలు పంజాబ్‌లోని రూప్ నగర్ నుంచి అనంతనాగ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఈ రైలులో 21 బీసీఎన్ వ్యాగన్ల సిమెంట్ పంపించారు. దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అనంతనాగ్ రీచ్ అయింది. ఈ చారిత్రాత్మక సంఘటన ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో కొత్తగా నిర్మించిన బనిహాల్-సంగల్దాన్-రియాసి-కత్రా విభాగం కార్యకలాపాల ప్రారంభాన్ని సూచిస్తుంది. దీంతో కశ్మీర్ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు భారతీయ రైల్వేల సరుకు రవాణా కారిడార్‌తో సజావుగా అనుసంధానించబడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వస్తువుల ప్రత్యక్ష రవాణా సాధ్యమవుతుంది. ఈ రైలులో రవాణా చేయబడిన సిమెంట్‌ను కశ్మీర్ లోయలో రోడ్లు, వంతెనలతో సహా కీలకమైన ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు.

ఈ రైలు మార్గంతో కశ్మీర్ ప్రజలకు ఎంతో లాభం చేకూరనుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ ప్రాంతానికి సరుకుల రవాణా చేయాలంటే శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే కొండచరియలు విరిగిపడటం, వాతావరణ సమస్యల వల్ల ఈ రోడ్డును తరచూ అధికారులు మూసేసేవారు. దీంతో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యేది. ప్రస్తుతం రైలు మార్గం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో ఊరట లభించింది. దీంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా కశ్మీర్‌కు, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరుకులను సులభంగా పంపించొచ్చు.

Next Story