వినియోగదారులకు తీపికబురు.. సిలిండర్ల డెలివరీపై కేంద్రం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. LPG ఉత్పత్తిని 25 శాతానికి పెంచడంతో పాటు, హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులు చేస్తున్నట్లుగా వెల్లడించింది.

వినియోగదారులకు తీపికబురు.. సిలిండర్ల డెలివరీపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సామాన్యులకు ఊరటనిస్తూ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇకపై సిలిండర్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందని స్పష్టం చేసింది. అయితే, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లుగా కేంద్రం వెల్లడించింది. దీంతొ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులు..

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మార్గంతో సంబంధం లేని ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా చమురు దిగుమతులు చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. హార్ముజ్ మార్గంలో నిలిచిపోయిన సప్లయ్ కంటే కూడా ఎక్కువ మొత్తంలోనే ఇతర వనరుల నుండి చమురును సేకరించామని ప్రభుత్వం పేర్కొంది. తద్వారా దేశంలో ఇంధన నిల్వలకు ఎటువంటి కొరత లేదని భరోసానిచ్చింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాల సమయంలో సిలిండర్ల కొరత లేకుండా వేగవంతమైన సేవలు అందుతాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story