కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 శాతం DA పెంపునకు గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-18 10:08:58  IST  )

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 శాతం DA పెంపునకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ PM Narendra Modi) అధ్యక్షతన ఇవాళ జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో దేశాభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పలు చారిత్రాత్మక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. రాజమండ్రి - విశాఖపట్నం మధ్య పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ మార్గంలో 3, 4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 2 శాతం కరువు భత్యాన్ని (DA) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల నెలవారీ పింఛను పెరగనుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని గ్రామీణ సడక్ యోజన (PMGSY) పథకాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నార. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలో భారతీయ నౌకలకు భద్రత, ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్’ (BMI Pool) ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పూల్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ. 12,980 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో విదేశీ బీమా సంస్థలపై ఆధారపడకుండా, స్వదేశీ బీమా సదుపాయం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది యుద్ధ ప్రమాదాలు, ఇతర నౌకాయాన నష్టాలకు కవరేజ్ అందిస్తుంది.

తీరప్రాంత అభివృద్ధికి రూ.9,889 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక, ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం భారీ నిధులను కేటాయించింది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 9,889 కోట్లను కేటాయించింది. ఈ మూడు పోర్టులను కలుపుతూ సుమారు 198 కిలోమీటర్ల మేర ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది పారిశ్రామిక రవాణాకు వెన్నెముకగా నిలవనుంది.

గోదావరిపై అద్భుత వంతెన

ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల మేర భారీ వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కోనసీమ, పరిసర ప్రాంతాల మధ్య రవాణా కష్టాలు తీరడమే కాకుండా, పోర్టుల మధ్య సరుకు రవాణా వేగవంతం అవుతుంది.

Next Story