- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రీ సిస్టర్స్ ఆత్మహత్య కేసు.. తండ్రే చంపేశాడా? విచారణలో సంచలన నిజాలు
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని భారత్ సిటీలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని భారత్ సిటీలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొరియన్ లవ్ గేమ్ కు బానిసలై.. అందులో ఇచ్చిన టాస్కుల్లో భాగంగానే వాళ్లు చనిపోయారని పోలీసులు భావించారు. కానీ.. తవ్వుతున్న కొద్దీ.. ఆ ముగ్గురి తండ్రి గురించిన నిజాలు బయటికొస్తున్నాయి. త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు దర్యాప్తులో భాగంగా.. వారి తండ్రి చేతన్ కుమార్ గురించి ఆరా తీయగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. 2015లో నమోదైన ఒక సూసైడ్ కేసులో చేతన్ పేరు ఉండటం కొత్త అనుమానాలకు దారితీసింది.
డీసీపీ నిమిష్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల తండ్రి చేతన్ 2015లో ఒక మహిళతో సహజీవనం చేశాడు. షాహిబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ కాలనీలో ఉండేవాడు. అకస్మాత్తుగా ఆ మహిళ భవనం పై నుంచి కిందపడి మరణించింది. చేతన్ పైనే అనుమానాలు తలెత్తాయి. విచారణలో అతని పాత్ర లేదని పేర్కొంటూ అప్పటి పోలీసులు సూసైడ్ గానే కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ విషయమే కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్తకోణం చూసేందుకు దారితీసింది. కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ప్రస్తుతం చేతన్ కు ముగ్గురు భార్యలు. సుజాత, హీనా, టీనా.. వీరు ముగ్గురు బంధువుల అమ్మాయిలే కావడం గమనార్హం. చనిపోయిన ముగ్గురు బాలికల్లో నిషిక సుజాతకు పుట్టగా.. ప్రాచీ, పాఖీ లు హీనాకు పుట్టారు.
కీలకంగా మారిన సూసైడ్ నోట్
కాగా.. పిల్లల మానసిక స్థితిపై కుటుంబ వాతావరణం, ఇంటి పరిస్థితుల ప్రభావం ఏ మేరకు ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తండ్రికే ఆఖరి సందేశం.. తల్లుల ప్రస్తావనే లేదు.
ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఆ లేఖలో బాలికలు తమ తండ్రిని ఉద్దేశించి మాత్రమే రాశారని, తమ ఇద్దరు తల్లుల (కుమార్ ఇద్దరు భార్యలు) గురించి కనీసం ప్రస్తావించలేదని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి వారికి తండ్రిపైనే ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి గది నుంచి 9 పేజీల డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
సెల్‌ఫోన్లు లాక్కోవడమే మరణానికి కారణమా?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం బాలికలను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది. కొరియన్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ మరియు విదేశీ స్నేహితులతో అతిగా గడపటాన్ని గమనించిన తండ్రి కుమార్, వారి ఫోన్లను లాక్కొని అమ్మేశారు. ఆత్మహత్య చేసుకున్న రాత్రి వారు తమ తల్లి ఫోన్ తీసుకున్నప్పటికీ, అందులో వారికి ఇష్టమైన కొరియన్ యాప్స్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో తేలింది.
రంగంలోకి సైబర్, ఫోరెన్సిక్ బృందాలు
బాలికల ఫోన్లలో ఉన్న డేటాను సేకరించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్లను కొన్న వ్యక్తులను ఐఎంఈఐ (IMEI) నంబర్ల ద్వారా గుర్తిస్తున్నారు. మరోవైపు చేతిరాత నమూనాలను, వేలిముద్రలను ల్యాబ్‌కు పంపారు.
అతిగా చదువుల ఒత్తిడి.. తల్లిదండ్రుల నిర్లక్ష్యం?
యూపీ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ బబితా సింగ్ బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. "పిల్లలపై విపరీతమైన చదువుల ఒత్తిడి ఉండటం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం ప్రాథమికంగా కనిపిస్తున్నాయి. పిల్లల మానసిక స్థితిని సరైన సమయంలో గుర్తించడంలో కుటుంబం విఫలమైంది" అని అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆమె ఆదేశించారు. ప్రస్తుతానికి పోలీసులు దీన్ని ఆత్మహత్యగానే పరిగణిస్తున్నారు. ఫోరెన్సిక్, సైబర్ రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.






