Gaza: గాజాకు సాయం పేరుతో డబ్బు వసూలు.. గుజరాత్‌లో సిరియా పౌరుడి అరెస్ట్

by B.Srinivas |

ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.

Gaza: గాజాకు సాయం పేరుతో డబ్బు వసూలు.. గుజరాత్‌లో సిరియా పౌరుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే గాజా యుద్ధంలో బాధితులుగా మిగిలామని నటిస్తూ మసీదుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సిరియన్ ముఠాను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సిరియాకు చెందిన అలీ మేఘత్ అల్-అజార్ అనే ముఠాలోని నిందితుడిని అరెస్టు చేశారు. అజార్ సహా ఆయన సహచరులు కొందరు పర్యాటక వీసాలపై జూలై 22న ఇండియాకు వచ్చారు. మొదట కోల్‌కతాలో దిగిన వీరు ఆ తర్వాత గుజరాత్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే గాజా యుద్ధ బాధితుల సంక్షేమం కోసం నిధులు సేకరిస్తున్నామని చెబుతూ గుజరాత్‌లోని మసీదుల నుంచి నిధులు సేకరిస్తున్నారు. అనంతరం ఆ డబ్బును విలాసాలకు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీలు చేపట్టి ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో అలీ మేఘత్ అల్-అజార్ ను అరెస్టు చేశారు. మిగతా వారు జకారియా హైతం అల్జార్, అహ్మద్ అల్హబాష్, యూసఫ్ అల్-జహర్‌గా గుర్తించారు. వీరు ప్రస్తుతం పరారీలో ఉండగా దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అరెస్టు చేసిన వ్యక్తిని బ్లాక్ లిస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించారు.

Next Story