Gavai: ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించవు.. సీజేఐ బీఆర్ గవాయ్

by B.Srinivas |

పరీక్షల్లో వచ్చే మార్కులు, ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించలేవని సీజేఐ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు.

Gavai: ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించవు.. సీజేఐ బీఆర్ గవాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పరీక్షల్లో వచ్చే మార్కులు, ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించలేవని సీజేఐ బీఆర్ గవాయ్ (Gavai) అభిప్రాయపడ్డారు. కృషి, పట్టుదల, అంకిత భావం ద్వారానే విజయం లభిస్తుందని తెలిపారు. గోవాలోని వీఎం సల్గావ్‌కర్ లా కాలేజీ స్వర్ణోత్సవ వేడకల్లో ఆయన ప్రసంగించారు. పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆలోచించొద్దని స్టూడెంట్స్ కు సూచించారు. ఎందుకంటే పరీక్షా ఫలితాలు విజయాన్ని నిర్ధారించబోవని తెలిపారు. తన విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసిన సీజేఐ తాను లా చేస్తున్నప్పుడు కళాళాలకు వెళ్లేవాడిని కాదని కానీ పుస్తకాలు, ఐదేళ్ల పరీక్షా పత్రాలను చదవడం ద్వారా తాను మెరిట్‌ జాబితాలో మూడో స్థానంలో నిలిచానని చెప్పారు. ‘నా బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచిన వ్యక్తి క్రిమినల్ లాయర్ అయ్యాడు, రెండో ర్యాంక్ సాధించిన వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడు. నేను కూడా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యాన. విజయం ర్యాంకుల నుంచి రాదు అనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని చెప్పారు. దేశంలో న్యాయ విద్యను మెరుగుపర్చాలని, ఇది కేవలం నేషనల్ లా యూనివర్సిటీలకే పరిమితం కావొద్దని పిలుపునిచ్చారు. క్లాట్, ఎన్ఎల్‌యూలు ఈ విషయంలో శ్రద్ద తీసుకుంటున్నప్పటికీ అవి న్యాయ విద్యావ్యవస్థలో చిన్న భాగం మాత్రమేనని తెలిపారు. యువ న్యాయవాదులు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ ప్రయోజనాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరాలన్నారు. చట్టపరమైన పరిష్కారం పొందే హక్కు పౌరులకు ఉందని తెలియకపోతే, దాని వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదని నొక్కి చెప్పారు.

Next Story