చేతులకు తాళ్లు.. మొహానికి ముసుగు.. పోలీసు ప్రొటెక్షన్ తో గ్యాంగ్ స్టర్ నామినేషన్

by Muthe.Rajitha |

ఓ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌ లీడర్‌ పుణె స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం కలకలం రేపుతోంది.

చేతులకు తాళ్లు.. మొహానికి ముసుగు.. పోలీసు ప్రొటెక్షన్ తో గ్యాంగ్ స్టర్ నామినేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌ లీడర్‌ పుణె స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం కలకలం రేపుతోంది. తన సొంత మనవడు ఆయుష్‌ కోమ్కర్‌ హత్య కేసులో నిందితుడిగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న బందు అందేఖర్‌కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశాడు. శనివారం నామినేషన్‌ కార్యాలయానికి తీసుకొచ్చే సమయంలో ముఖానికి నల్లటి వస్త్రం కట్టి, చేతులకు తాళ్లు వేసిన పోలీసులు జైలు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నామినేషన్‌ వేసేందుకు వస్తూ అందేఖర్‌ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆయన కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలు కూడా కోర్టు అనుమతితో ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 5న నానాపేటలో జరిగిన కాల్పుల్లో ఆయుష్‌ కోమ్కర్‌ మృతి చెందాడు. ఈ కేసులో అందేఖర్‌, ఆయన కుటుంబ సభ్యులు సహా మరో 15 మందిపై హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. కాగా పుణెతో పాటు మరో 28 ప్రాంతాల్లో జనవరి 15న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

Next Story