AI Summit: దేశం పరువు బజారు పాలు..గల్గోటియాస్‌ క్షమాపణలు చెబితే చాలా?

by Prasad Jukanti |   (  Updated:2026-02-18 13:35:35  IST  )

ఏఐ సమ్మిట్‍లో గల్గోటియాస్‌ యూనివర్సిటీ నిర్వాకంపై అంతర్జాతీయ మీడియా ఏకి పారేస్తోంది.

AI Summit: దేశం పరువు బజారు పాలు..గల్గోటియాస్‌ క్షమాపణలు చెబితే చాలా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా-ఏఐ సమ్మిట్‌ 2026 (India AI Summit 2026) ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాశంగా మారింది. వారం రోజులపాటు విస్తృత చర్చలు, ఒప్పందాలు, సాంకేతిక ప్రదర్శనలు వగైరా ఉండాల్సిన ఈ వేదిక ఇప్పుడు లోకల్ టు గ్లోబల్ మీడియా ముందు నవ్వుల పాలైంది. దీనంతటికీ గుర్గావ్ కు చెందిన గల్గొటియాస్ యూనివర్సిటీ (Galgotias University) చూపిన అత్యుత్సాహమే కారణం. అతి చేయబోయి దేశాన్నే ప్రపంచం ముందు అబాసుపాలు చేసిన ఈ యూనివర్సిటీ నిర్వాకంపై ఇప్పుడు సర్వత్ర తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో దెబ్బకి దిగివచ్చిన ఈ యూనివర్సిటీ క్షమాపణలు కోరింది. అయితే ఓ వైపు సోషల్ మీడియా, మరోవైపు అంతర్జాతీయ మీడియా మన పరువు బజారుపాలు చేస్తుంటే జరిగిన పొరపాటు యూనివర్సిటీ క్షమాపణలో సరిదిద్దుకుందామా? ప్రభుత్వం చెబుతున్న వివరణలతో సరిపెడుదామా? ఇప్పుడిదే అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఇంతకీ ఏం జరిగింది?:

భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ఏఐ సమ్మిట్-2026’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవిదేశాల ప్రముఖులు ఈ సమ్మిట్‍కు హాజరువుతున్నారు. అయితే ఈ సమ్మిట్‍లో గల్గోటియాస్ యూనివర్సిటీకి సైతం ఓ స్టాల్ కేటాయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్‌లో కమ్యూనికేషన్స్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న ప్రొఫెసర్ నేహా సింగ్ డీడీ న్యూస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఓ రోబో డాగ్ ను చూపిస్తూ ఇది మా స్టూడెంట్స్ ఆవిష్కరరణ అని చెప్పారు. అంతే కాదు దానికి ‘Orion’ అని పేరు పెట్టామని హెచ్చులకు పోయారు. అయితే వాస్తవానికి ఆమె చెబుతున్న రోబో డాగ్ చైనాలోని ఓ కంపెనీ తయారు చేసిందని చైనా ఉత్పత్తిని తమ ఆవిష్కరణగా చెప్పుకోవడం ఏంటని యూనివర్సిటీపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక చైనాతో పాటు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు ఈ యూనివర్సిటీ చేసిన ఫాల్స్ క్లెయిన్‍ను ఉతికి ఆరేశాయి.

ప్రతిపక్షాల విమర్శలు:

ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ భారతదేశం వద్ద అపారమైన డేటా, టాలెంట్ ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ఏఐ రంగాన్ని ప్రభుత్వం ఒక జోక్‌గా మార్చేసిందని. మోదీ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి పనుల వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతింటోందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం చైనా రోబోలను భారతీయ ఉత్పత్తులుగా ప్రమోట్ చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు గుప్పించారు.

ఏఐ సదస్సు నుంచి ఆ యూనివర్సిటీ గెంటివేత:

గల్గొటియాస్ యూనివర్సిటీ నిర్వాకం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. సదస్సులో నుంచి గల్గోటియాస్‌కు ఉద్వాసన పలికింది. దానికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు. తమది కాని వస్తువులను ఎవరూ ప్రదర్శించకూడదని ఐటీ సెక్రటరీ ఎస్‌ కృష్ణన్‌ వెల్లడించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

క్షమాపణలు కోరిన యూనివర్సిటీ:

చైనా రోబోడాగ్‌ వివాదంపై గల్గొటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. AI సమ్మిట్‌లో ఏర్పడిన గందరగోళానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాము. తమ ప్రతినిధికి సరైన సమాచారం లేకపోవడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమెకు ఆ ఉత్పత్తి టెక్నికల్ మూలాల గురించి తెలియదు. కెమెరాకు మాట్లాడే ఉత్సాహంలో వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం మాట్లాడారు. ఆమెకు ప్రెస్‌తో మాట్లాడే అధికారం కూడా లేదు. రోబో డాగ్ మా ఆవిష్కరణగా చెప్పుకునే సంస్థాగత ఉద్దేశం తమ యూనివర్సిటీకి లేదు. గల్గోటియాస్ యూనివర్సిటీ అకాడమిక్ ఇంటిగ్రిటీ, పారదర్శకత, బాధ్యతాయుత ప్రదర్శనకు కట్టుబడి ఉంది. నిర్వాహకుల భావనలను అర్థం చేసుకుని మేము ఏఐ సమ్మిట్ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం అని ప్రకటనలో పేర్కొంది.

క్షమాపణలతో సరా?:

కృత్రిమ మేధ వినియోగంలోనే కాదు ఏఐ క్రియేషన్ లోనూ ఇండియా అగ్రగామిగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-3 ఏఐ అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుందని దీన్ని మన యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏఐ సమ్మిట్ లో భారత్ లోని ఎన్నో ఏఐ స్టార్టప్ లు ఆశలు పెట్టుకున్నాయి. యువత గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఈ సమ్మిట్ నిర్వహణపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలిరోజు సందర్శకులు భారీగా రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) స్పందిస్తూ సదస్సుకు హాజరైన వారికి క్షమాపణలు చెప్పారు. ఇక ఈ సమ్మిట్ లో ప్రధాని మోడీ వస్తున్నారని స్టాల్ నుంచి తనను సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపించారు. తిరిగి వెళ్లే సరికి తన స్టాల్ లో ఉండాల్సిన వస్తువులు లూటీ అయ్యాయని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏర్పాట్ల విషయంలో తొలి నుంచి కేంద్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రోబోడాగ్ వివాదం ఇప్పుడు మన దేశ పరువును బజార్లో విసిరినట్లు చేసింది. ఓ వైపు కేంద్ర మంత్రి, ఇప్పుడు యూనివర్సిటీ క్షమాపణలు చెబితే పోయిన పరువు వస్తుందా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

Next Story