- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో ఇంధన కొరత.. పెట్రోల్ బంక్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రజలు!
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఇంధన కొరతతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం చాలా మంది ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో పెట్రోల్ బంక్ వద్ద భారీ ఘర్షణ చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఇంధన కొరతతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం చాలా మంది ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో పెట్రోల్ బంక్ వద్ద భారీ ఘర్షణ చోటుచేసుకుంది. వినియోగదారులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. స్థానిక ఇండియన్ ఆయిల్ డీలర్ జితేంద్ర చోప్రా తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో 15,000 లీటర్ల డీజిల్, 5,000 లీటర్ల పెట్రోల్‌తో ఒక ట్యాంకర్ బంక్‌కు చేరుకుంది. ట్యాంకర్ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే, సుమారు 400 నుంచి 500 మంది తమ వాహనాలు, ఇంధన క్యాన్లతో అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ అన్‌లోడ్ చేస్తుండగా సుమారు 100కు పైగా వాహనాలు క్యూలో నిలబడ్డాయి. అయితే, టెక్నాలజీ ఆటోమేషన్ సిస్టమ్ నిబంధనల ప్రకారం.. అన్‌లోడింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇంధన విక్రయాలు చేపట్టడం సాధ్యపడదని డీలర్ తెలిపారు. బంక్ లోపల డీజిల్, పెట్రోల్ అన్‌లోడింగ్ పాయింట్లు వేర్వేరుగా ఉన్నాయి. కార్మికులు పెట్రోల్‌ను అన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, పెట్రోల్ స్టోరేజ్ ఏరియా వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను ప్రజలు అడ్డుకున్నారు.
క్యూలో ఇంధనం కోసం ఎదురుచూస్తూ..
సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు ట్యాంకర్‌ను వెళ్లేందుకు ప్రజలు అనుమతించారు. కానీ, క్యూలో ఇంధనం కోసం ఎదురుచూస్తున్న వారి మధ్య అప్పటికే మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. వినియోగదారులు ముందుగా ఒకరికొకరు చేతులతో దాడులు చేసుకోగా, ఆ తర్వాత చేతిలో ఉన్న ఇంధన క్యాన్లతో కొట్టుకున్నారు. మరికొందరు బయట నుంచి కర్రలు తీసుకువచ్చి ఇతరులపై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బంక్ సిబ్బంది సహాయంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వాతావరణం సద్దుమణిగిన తర్వాత బంక్ నిర్వాహకులు ఇంధన విక్రయాలను పునఃప్రారంభించారు. అత్యవసర పనుల నిమిత్తం ఎక్కువ మందికి ఇంధనం అందాలనే ఉద్దేశంతో ఒక్కో వాహనానికి 10 నుంచి 15 లీటర్లు మాత్రమే పరిమితం చేశారు. ఇలా రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగగా, ఆ తర్వాత బంక్‌లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి.
డీలర్ల హెచ్చరిక..
పోలీసుల తగిన రక్షణ, అధికారుల సహకారం లేకుండా ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు కొనసాగితే ఇంధనాన్ని తెప్పించి విక్రయించడం కష్టమని జితేంద్ర చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి శాంతియుతంగా మారేంతవరకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిలిపివేసే ఆలోచన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.






