తనిఖీలు పూర్తి.. మిగతా విమానాల ఇంధన స్విచ్‌లపై ఎయిరిండియా కీలక రిపోర్ట్..

by Naga Rani Yarlagadda |

బోయింగ్ 787, 737 మోడళ్లలో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలపై డీజీసీఏ (DGCA) ఆదేశాలతో ప్రారంభమైన తనిఖీలను ఎయిర్ ఇండియా (Air India) పూర్తి చేసినట్లు ప్రకటించింది.

తనిఖీలు పూర్తి.. మిగతా విమానాల ఇంధన స్విచ్‌లపై ఎయిరిండియా కీలక రిపోర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: బోయింగ్ 787, 737 మోడళ్లలో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలపై డీజీసీఏ (DGCA) ఆదేశాలతో ప్రారంభమైన తనిఖీలను ఎయిర్ ఇండియా (Air India) పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ తనిఖీల్లో ఎలాంటి లోపాలు లేదా సాంకేతిక సమస్యలు తమకు గుర్తపడలేదని స్పష్టం చేసింది.

ఈ తనిఖీలు లండన్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం అహ్మదాబాద్‌లో ఇంధన స్విచ్‌ల లోపంతో (Ahmedabad Flight Crash) కూలిపోయిన ఘటన తరువాత ప్రారంభమయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఇంధన నిష్క్రమణ సమస్య దృష్టిలో పెట్టుకుని, జులై నెలాఖరు నాటికి అన్ని భారతీయ రిజిస్ట్రేషన్ ఉన్న బోయింగ్ విమానాల్లో పరిశీలన పూర్తి చేయాలని డీజీసీఏ ఆదేశించింది.

“బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలపై ముందస్తు భద్రతా తనిఖీలు జులై 12న ప్రారంభించి, డీజీసీఏ ఇచ్చిన గడువులోనే పూర్తి చేశాం. ఈ తనిఖీల్లో ఎలాంటి లోపాలు గుర్తించలేదు. ఈ సమాచారం ఇప్పటికే నియంత్రణ సంస్థకు తెలియజేశాం.” అని ఎయిరిండియా పేర్కొంది. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఒక్కసారిగా "రన్" నుంచి "కటాఫ్" మోడ్‌కు మారినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ మార్పు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగినట్లు తెలియజేశారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదానికి పైలట్లు మాత్రమే బాధ్యులన్న విదేశీ మీడియా కథనాలను ఖండిస్తూ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టమైన ప్రకటన చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. “ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. తుది నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి సమాచారం అందుతుంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ కేసును పారదర్శకంగా విచారిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోంది. విదేశీ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు అనవసరం.” అని పేర్కొన్నారు.

Next Story