- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యువు ముంగిట నుంచి..! గుజరాత్‌లో భయానక లిఫ్ట్ ప్రమాదం వైరల్
లిఫ్ట్ నుంచి దిగుతుండగా అది ఒక్కసారిగా పైకి కదలడంతో జరిగిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లిఫ్ట్ నుంచి దిగుతుండగా అది ఒక్కసారిగా పైకి కదలడంతో జరిగిన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. వల్సాద్‌లోని సర్దార్ హైట్స్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ భవనంలోని తొమ్మిదో అంతస్తులో నివసించే ఒక వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లోపల ఉన్న సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. అతను లోపలికి వెళ్లిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కి, డోర్‌కు దగ్గరగా నిలబడ్డారు. సుమారు 35 సెకన్ల తర్వాత లిఫ్ట్ కిందకు రాగానే డోర్లు తెరుచుకున్నాయి. అతను బయటకు అడుగు వేస్తుండగానే, ఊహించని విధంగా లిఫ్ట్ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. ఆ వేగానికి అతను లిఫ్ట్ కింద ఉన్న గ్యాప్‌లో పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే, అదృష్టవశాత్తూ అతను చాకచక్యంగా బయటకు దూకేశారు. ఈ క్రమంలో అతని తల లిఫ్ట్ డోర్‌కు బలంగా తగలడంతో స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఆపార్ట్‌మెంట్ యాజమానుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ‘మృత్యువు ముంగిట నుంచి వచ్చింది. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. చాలా ప్రాంతాల్లో సొసైటీల్లో లిఫ్టుల నిర్వహణ అస్సలు లేదు. తుప్పు పట్టిన కేబుల్స్, మొరాయిస్తున్న సిస్టమ్స్‌తో ఇవి 'మృత్యు పాశాలు'గా మారుతున్నాయి’ అని ఒక నెటిజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో షేర్ చేశారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సొసైటీ సభ్యులు, సదరు లిఫ్ట్ ను తాత్కాలికంగా నిలిపివేసి మరమ్మతులు చేపట్టినట్లు సమాచారం. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో భవన నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.
గమనిక: అపార్ట్‌మెంట్లలో నివసించే వారు తమ భవనంలోని లిఫ్టుల కండిషన్, కేబుల్స్, సెన్సార్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.






