Kejriwal: క్రిమినళ్లను పార్టీలోకి తీసుకుని, కేసులు కొట్టేయించి పదవులిచ్చే వారిని ఎన్నేళ్లు శిక్షించాలి

by S Gopi |   (  Updated:2025-08-25 17:01:32  IST  )

కేంద్రం ఉద్దేశపూర్వకంగా కల్పించిన కేసులో తాను జైలు పాలయ్యానని ఆయన అన్నారు.

Kejriwal: క్రిమినళ్లను పార్టీలోకి తీసుకుని, కేసులు కొట్టేయించి పదవులిచ్చే వారిని ఎన్నేళ్లు శిక్షించాలి
X

దిశ, నేషనల్ బ్యూరో: జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి యోగ్యతను ప్రశ్నించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా కల్పించిన కేసులో తాను జైలు పాలయ్యానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుంభకోణాల్లో ఇరుక్కున నేతలను బీజేపీలో చేర్చుకోవడాన్ని తప్పుబట్టారు. నేరం చేసిన వారిని పార్టీలోకి తీసుకుని, సీఎం, పీఎంలుగా చేసిన వారికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇతర పార్టీల్లోని వారిని బీజేపీలోకి తీసుకోవడంపై సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ చేర్చుకున్న వారిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నవారే. తీవ్రమైన నేరం చేసిన వారిని పార్టీలోకి తీసుకుని, వారిపై ఉన్న కేసులను కొట్టేస్తున్నారు. అంతేకాకుండా వారిని మంత్రులు, ఉపముఖ్యమంత్రు, ముఖ్యమంత్రులను చేస్తున్నారు. ఒకరిని తప్పుడు కేసులో ఇరికించి, ఆపై నిర్దోషిగా విడుదలైతే అప్పుడు ఏం చేస్తారు, సదరు వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడాలో చెప్పాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోం మంత్రి అమిత్ షా నేరం చేసి 30 రోజులపాటు జైలుకెళ్లిన పీఎం, సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును సమర్థించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాల్లో నైతికత ముఖ్యమని, అందుకు ఉదాహరణగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగించారని, అలా చేయకపోయి ఉంటే ఈ బిల్లు వచ్చేది కాదన్నారు.

Next Story