భారత్‌లో మళ్లీ 'రయ్‌ రయ్‌' మోత.. 12 ఏళ్ల తర్వాత ఫార్ములా-1 రీఎంట్రీ!

by Ramesh Naini |

దేశంలోని రేసింగ్ ప్రియులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత, ప్రపంచ ప్రసిద్ధ 'ఫార్ములా-1' (F1) గ్రాండ్‌ప్రి రేసులను మళ్లీ భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

భారత్‌లో మళ్లీ రయ్‌ రయ్‌ మోత.. 12 ఏళ్ల తర్వాత ఫార్ములా-1 రీఎంట్రీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని రేసింగ్ ప్రియులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత, ప్రపంచ ప్రసిద్ధ 'ఫార్ములా-1' (F1) గ్రాండ్‌ప్రి రేసులను మళ్లీ భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2013లో చివరిసారిగా గ్రేటర్ నోయిడాలోని 'బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్'లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ను పునరుద్ధరించేందుకు కేంద్ర క్రీడాశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజాగా గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్‌ను స్వయంగా సందర్శించారు. ప్రస్తుతం ఈ ట్రాక్ నియంత్రణలో ఉన్న యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ రేసులను వీలైనంత త్వరగా పునఃప్రారంభించాలని, ఇందుకోసం ట్రాక్ నిర్వహణ బాధ్యతలను 2-3 ఏళ్ల పాటు ఏదైనా ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి అప్పగించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

అడ్డంకులు తొలగేనా?

2011లో అట్టహాసంగా మొదలైన ఫార్ములా-1 భారత్ ప్రయాణం.. పన్ను వివాదాలు, తదితర అడ్డంకుల వల్ల 2013లోనే అర్ధాంతరంగా నిలిచిపోయింది. గతంలో దీనిని కేవలం ఒక వినోద కార్యక్రమంగా పరిగణించడం వల్ల భారీగా పన్నులు పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఉన్న పన్ను సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీవాలా తీసిన జేపీ గ్రూప్ నుంచి బుద్ధ సర్క్యూట్‌ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఈ ఒప్పందం గనుక ఓ కొలిక్కి వస్తే, ఫార్ములా-1 పునరాగమనం మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 24 రేసులతో F1 క్యాలెండర్ బిజీగా ఉన్నప్పటికీ, భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశంలోకి తిరిగి రావడానికి నిర్వాహకులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కో రేసుకు రూ. 500 కోట్ల వరకు ఖర్చు!

ఒక్కో రేసు నిర్వహణకు ఏటా దాదాపు రూ. 160 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పలు దేశాల్లో వాటి నిర్వాహణకు అక్కడి ప్రభుత్వాలే పూర్తి ఖర్చు భరిస్తున్నాయి. భారత్‌లో కూడా ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభిస్తేనే ఇది సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ చూస్తుంటే.. త్వరలోనే భారత గడ్డపై ఫార్ములా-1 కార్లు గాలి వేగంతో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story