కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2026-01-06 03:05:44  IST  )

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేష్ కల్మాడీ (81) కన్నుమూశారు.

కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేష్ కల్మాడీ (Suresh Kalmadi) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పుణెలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థివ దేహానికి పుణెలోని వైకుంఠ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వైమానిక దళ పైలట్‌గా కెరీర్ ప్రారంభించిన కల్మాడీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పుణె ఎంపీగా, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. సుదీర్ఘకాలం పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా ఉన్న ఆయన, 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో వచ్చిన అవినీతి ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో అరెస్టు తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

సురేష్ కల్మాడీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన భౌతిక కాయాన్ని పుణె, ఎరండ్వానేలోని 'కల్మాడీ హౌస్'లో మధ్యాహ్నం 2 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం, నవీ పేట్‌లోని వైకుంఠ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు."

Next Story