వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ మాజీ సీఎం సంచలన ప్రకటన

by Prasad Jukanti |

రాజకీయాలు చాలా కలుషితమయ్యాయని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కర్ణాటక మాజీ సీఎం సంచలన ప్రకటన చేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ మాజీ సీఎం సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బిగ్ షాక్ ఇచ్చారు. ఎన్నికల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయనని స్పష్టం చేశారు.ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ సందేశంతో కూడిన పోస్టు చేశారు. ‘ఈ రోజుల్లో రాజకీయ రంగం కలుషితమైపోయింది. నేను 2028 విధానసభ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. పోటీకి దూరంగా ఉన్నప్పటికీ క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో వారికి తోడుగా నిలిచి.. వారి గొంతుకగా మారతాను' అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

వయోభారం..

వరుణ నియోజకవర్గం ప్రజలు మళ్లీ నన్ను ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని. కానీ ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నేను నిశ్చయించుకున్నట్లు సిద్దరామయ్య స్పష్టం చేశారు. గతంలో నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ప్రజలే మాకు డబ్బులిచ్చి గెలిపించేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం నాకు 79 ఏళ్లు అని మన ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం కూడా మునుపటిలా సహకరించడం లేదు. గతంలోలాగా అదే ఉత్సాహంతో పనిచేయడం ఇక సాధ్యం కాదన్నారు. 2028 నాటికి నా వయసు 82 ఏళ్లు, నా రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1978లో ఒక తాలూకా బోర్డు సభ్యుడిగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. నేను ఓటములు, గెలుపులు రెండింటినీ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని, నా అంతరాత్మను మోసం చేయలేదని సంతృప్తి నాకు ఉందని పేర్కొన్నారు.

ఐదు దశాబ్దాలు నన్ను ఆదరించారు:

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని నేటి రాజకీయం పూర్తిగా కలుషితమైపోయాయన్నారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం లేకుండా పోయిందని ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ఆప్యాయంగా నడిపించారు. ఈ ప్రజలకు రుణపడి ఉంటానని అందుకే నా శేష జీవితం కూడా ప్రజాసేవకే అంకితం అన్నారు.

రైతు కుటుంబం నుంచి సీఎం స్థాయికి:

కర్ణాటక రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరు సంపాదించుకున్న సిద్ధరామయ్య ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. మైసూర్ సమీపంలో సిద్ధరామనహుండిలో 1948 ఆగస్టు 12న ఆయన జన్మించారు. కర్ణాటకలో అది పెద్ద సామాజిక వర్గమైన కురుబ ఓబీసీకి చెందిన ఆయన మైసూర్ లో న్యాయవాదిగా న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ రైతు నాయకుడు నంజుండ స్వామి శిష్యుడిగా మారిపోయారు. ఆయన స్ఫూర్తితో 1978లో తాలుకా బోర్డు సబ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1963లో తొలిసారి చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపోందారు. 2006 లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన్ను డీఎంకే సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ లో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఆ తర్వాత ఎన్నికయ్యారు. 2013-2018 టర్మ్ లో, ఆ తర్వాత 2023 నుంచి ఈ ఏడాది (2026) మే వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. మే నెలలో అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే సిద్ధరామయ్య ఆకస్మిక నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది.

Next Story