ప్రతిపక్ష నాయకుడితో విదేశీ ప్రముఖుల భేటీని అడ్డుకుంటున్నారు: రాహుల్ గాంధీ

by Malleboina Mahesh |

ప్రతిపక్ష నాయకుడితో విదేశీ ప్రముఖుల భేటీని అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుడితో విదేశీ ప్రముఖుల భేటీని అడ్డుకుంటున్నారు: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్ష నాయకుడితో విదేశీ ప్రముఖుల భేటీని అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల నుండి భారతదేశాన్ని సందర్శించే ప్రముఖులు ప్రతిపక్ష నాయకుడిని కలవడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ఈ సంప్రదాయం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. "కానీ ఈ రోజుల్లో, విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు, నేను విదేశాలకు వెళ్లినప్పుడు, ప్రతిపక్ష నాయకుడిని కలవవద్దని ప్రభుత్వం వారికి సూచిస్తోంది. ఇది వారి విధానం, వారు ఎల్లప్పుడూ ఇలానే చేస్తున్నారు" అని రాహుల్ గాంధీ విమర్శించారు.

రష్యా అధ్యక్షుడి పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, "మాకు అందరితోనూ సంబంధాలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు భిన్నమైన దృక్పథాన్ని అందిస్తారు. మేము కూడా భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాము. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేసే పని కాదు. బయట నుంచి వచ్చే వ్యక్తులను ప్రతిపక్షం కలవడానికి ప్రభుత్వం ఇష్టపడదు." అని రాహుల్ గాంధీ అన్నారు. "మోడీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నియమాన్ని పాటించడం లేదు. ఇది వారి అభద్రతా భావం (insecurity)" అని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

Next Story