- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru: బెంగళూరులో భారీ వర్షాలు
కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరు నగరం భారీ వర్షానికి తడిసి ముద్దయింది. ఆదివారం రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. రెండు రోజుల కురుస్తున్న వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఐఎండీ వివరాల ప్రకారం, బెంగళూరులో సోమవారం ఉదయం 8:30 గంటల నాటికి 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి దాదాపు 90 మి.మీ వర్షపాతం నమోదైంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ వాతావరణ కేంద్రం 44.2 మి.మీ వర్షపాతం నమోదు చేయగా, హెచ్ఏఎల్ స్టేషన్ 78.3 మి.మీ వర్షపాతం నమోదు చేసింది.
గడిచిన దశాబ్ద కాలంలో రెండవసారి ఒక్క రోజులోనే బెంగళూరు నగరం 100 మి.మీ వర్షపాతాన్ని నమోదు చేసింది. ఇదివరకు 2022, మేలో 155 మి.మీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్య పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. మే నెలలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైన 1909 నాటి 153.9 మి.మీ వర్షపాతమే ఇప్పటివరకు ఆల్-టైమ్ రికార్డుగా ఉంది. విల్సన్ గార్డెన్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, నాగవరలోని నందగోకుల లేఅవుట్, హెచ్‌బీఆర్ లేఅవుట్ 5వ బ్లాక్, హెన్నూర్, సాయి లేఅవుట్, మాన్యత టెక్ పార్క్, కోరమంగళలోని ఎస్టీ బెడ్ లేఅవుట్, సిల్క్ బోర్డ్ ముంపునకు గురయ్యాయి.
సోమవారం ఉదయం అనేక ప్రాంతాల్లో నీటితో నిండిన రోడ్ల కారణంగా ట్రాఫిక్ స్తంబించింది. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నీరు నిలిచిపోవడంతో ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌ను మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పోలీసులను కూడా ఇబ్బంది పెట్టింది. శాంతినగర్‌లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీ) కార్యాలయం వరదల్లో మునిగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయిందని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు ఫైల్స్, ఇతర పత్రాలకు ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నారు.






