కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ప్రజలకు వార్నింగ్ బెల్స్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-05 06:02:32  IST  )

అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో భారీగా కార్చిచ్చు (wildfire) సంభవించింది.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ప్రజలకు వార్నింగ్ బెల్స్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో సంభవించిన భారీ కార్చిచ్చు (wildfire) వేగంగా వ్యాపిస్తోంది. 'గిఫ్‌ర్డ్ ఫైర్ (Gifford Fire)'గా పిలుస్తున్న ఈ అగ్ని ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం సాల్వాంగ్, కాలిఫోర్నియాలోని లాస్ పాడ్రస్ నేషనల్ ఫారెస్ట్ పరిధిలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు 72,000 ఎకరాలకు పైగా విస్తరించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 1000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా, కేవలం 3 శాతం మంటలు మాత్రమే నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మంటలను అదుపుచేసేందుకు అడ్డంకులు తప్పడం లేదన్నారు.

భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఈక్రమంలో గాలి నాణ్యత భారీగా క్షీణిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉన్న లాస్‌ ఏంజెలెస్‌, వెంచురా, కార్న్‌ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతో పాటు పొరుగునున్న లాస్‌ వెగాస్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంటల నేపథ్యంలో చుట్టుపక్కల పలు రహదారులను కూడా అధికారులు మూసేశారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఇంకొన్ని రోజుల్లో వాతావరణం మరింత వేడి ఎక్కువవనున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Next Story