Maha Kumbh: మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం..

by Shamantha N |

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా (Maha kumbha Mela)లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది.

Maha Kumbh: మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా (Maha kumbha Mela)లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 18లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఓల్డ్ జీటీ రోడ్ లోని తులసి చౌరాహా సమీపంలోని శిబిరంలో మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారని ఖాక్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యోగేష్ చతుర్వేది వెల్లడించారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు చెప్పారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.

వరుస ప్రమాదాలు

కాగా, కుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 30న సెక్టర్‌ 22లో ఛత్నాగ్‌ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్‌ సిటీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. ఆతర్వాత మౌని అమావాస్య సందర్భంగా గత నెల 29వ తేదీన కుంభమేళా ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై న్యాయ విచారణకు ఆదేశించారు. న్యాయ కమిటీ తన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. ఇకపోతే, 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.

Next Story