POK: రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోండి

by S Gopi |

13 నియోజకవర్గాల ప్రజలు కనీసం రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని అక్కడి అధికారులు తెలిపారు.

POK: రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోండి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్ దాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న కారణంతో భారత ప్రభుత్వం ఈసారి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. పాకిస్తాన్ తన సైన్యాన్ని భారత సరిహద్దుల వద్ద మోహరించింది. మరోవైపు భారత్ కశ్మీర్ గొడవను పూర్తిగా లేకుండా చేయడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంకేతంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల ప్రజలు కనీసం రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని అక్కడి అధికారులు తెలిపారు. పీఓకే అధికారులు 1,000కి పైగా పాఠశాలలను 10 రోజుల పాటు మూసేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. పీఓకే ప్రధాని చౌధరీ అన్వర్ ఉల్‌హక్ స్థానిక అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ. 30 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని, ఆహారంతో పాటు ఔషధాలు, కనీస అవస్రాలకు లోటు లేకుండా చూసుకునేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

మరోవైపు, పాకిస్తాన్ గత వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఇప్పటికే వారికి హెచ్చరిక జారీ చేసింది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కుట్ర ద్వారా పీఓకే సొంతం చేసుకున్న పాకిస్తాన్, ఆ ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. పీఓకే ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వారంతా పాక్ ప్రభుత్వానికి దాసోహమయ్యారు. దీనివల్ల అక్కడ స్థానికంగా ప్రజలకు భద్రత కరువైంది. పాకిస్తాన్ ఆర్థికంగా కృంగిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఉగ్రవాద దాడులు ప్రజల్లో మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ పీఓకేను స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది.

Next Story