Dallewal: ఆయన నిజమైన రైతు నాయకుడు- దల్లేవాల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

by Shamantha N |

రైతు నాయకుడు జగజీత్ సింగ్ దల్లేవాల్ శుక్రవారం నిరవధిక నిరసన దీక్షను విరమించారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Dallewal: ఆయన నిజమైన రైతు నాయకుడు- దల్లేవాల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతు నాయకుడు జగజీత్ సింగ్ దల్లేవాల్ శుక్రవారం నిరవధిక నిరసన దీక్షను విరమించారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. పంజాబ్ సర్కారు హామీలు అంగీకరిస్తూ.. దల్లేవాల్ దీక్ష విరమించారు. కాగా.. రైతుల డిమాండ్ల సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన దల్లేవాల్ ను సుప్రీంధర్మాసనం ప్రశంసించింది. రైతులకు మంచి చేయాలనే ఆలోచన తప్ప.. ఆయనకు ఎలాంటి రాజకీయ అజెండా లేదని పేర్కొంది. ఆయన్ని నిజమైన రైతు నాయకుడని కొనియాడింది. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలను ఆదేశించింది. రైతుల ఫిర్యాదులను పరిశీలించి, అక్కడి పరిస్థితిని తెలియజేసే నివేదికలను దాఖలు చేయాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీని కోరింది. దల్లేవాల్‌‌కు వైద్యసహాయం అందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించనందుకు పంజాబ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌పై విధించిన కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

నవంబర్ నుంచి దీక్ష

పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లతో నవంబరు 26 నుంచి జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. దీంతో రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యసహాయం అందించాలని సుప్రీం అక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, దల్లేవాల్‌కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయని పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇచ్చేందుకు వీలుచిక్కడం లేదని పంజాబ్‌ ప్రభుత్వం వాపోయింది. రైతు ప్రతినిధులతో చర్చలకు కేంద్రం అంగీకరిస్తే వైద్యసాయం పొందడం తనకు సమ్మతమేనని రైతు నాయకుడు జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ ఇటీవల ప్రకటించారు.

Next Story