Expert group: సరిహద్దు వివాదానికి నిపుణుల కమిటీ.. భారత్, చైనా కీలక నిర్ణయం

by B.Srinivas |

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, చైనాలు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

Expert group: సరిహద్దు వివాదానికి నిపుణుల కమిటీ.. భారత్, చైనా కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, చైనాలు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ కమిటీ వీలైనంత త్వరగా సమస్యను గుర్తించి పరిష్కారాన్ని కనుగొనేలా చర్యలు తీసుకునేందుకు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల సంబంధాల్లో మరింత పురోగతి సాధించనున్నాయి. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే నిపుణుల కమిటీ ఏర్పాటుపై డిసిషన్ తీసుకున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను పునఃప్రారంభించాలని, కైలాస పర్వతం, మానసరోవర్ యాత్రకు పర్యటకులను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి అధ్యక్షుడు జిన్‌పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధాని మోడీకి అందజేశారు. వాయింగ్ యీతో భేటీపై మోడీ స్పందించారు. ‘చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలవడం సంతోషంగా ఉంది. గతేడాది కజాన్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసిన తర్వాత భారత్-చైనా సంబంధాలు నిరంతరం బలోపేతమయ్యాయి. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా టియాంజిన్‌లో జరిగే తదుపరి సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత్ , చైనాల మధ్య స్థిరమైన, వ్యూహాత్మక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఎంతో దోహదపడతాయి’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అంతకుముందు వాంగ్ యీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. భారతదేశం-చైనా సరిహద్దు సమస్యపై 24వ రౌండ్ ప్రతినిధుల చర్చలు జరిపారు. భారత్ చైనాల మధ్య వివాదంతో ఇరు దేశాలకూ నష్టమేనని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. గతేడాది కజాన్‌లో చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, ప్రధాని మోడీల మధ్య జరిగిన భేటీ అనంతరం భారత్ చైనాల ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయని తెలిపారు. తద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలకు మార్గం సుగమమైందని చెప్పారు. ఇరుపక్షాలు వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అనుసరించాలని, కమ్యూనికేషన్ ద్వారా పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సహకార రంగాలను విస్తరించాలని, సరిహద్దు సమస్యలను సరిగ్గా పరిష్కరించడానికి కృషి చేయాలని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా భారత్ చైనాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. బార్డర్‌లో శాంతి నెలకొందని, ప్రస్తుతం స్థిరమైన పరిస్థితి ఉందన్నారు.

Next Story