వాహనదారులకు కేంద్రం భారీ శుభవార్త.. లీటర్‌కు రూ.10 ఊరట

by Gantepaka Srikanth |

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల నుంచి దేశీయ వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వాహనదారులకు కేంద్రం భారీ శుభవార్త.. లీటర్‌కు రూ.10 ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల నుంచి దేశీయ వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని (కేంద్ర అబ్కారీ పన్ను) తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశంలోని సామాన్యులపై ఆ భారం పడకుండా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) 37వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి, దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని వివరిస్తూ ఇంధన ధరల తగ్గింపుపై స్పష్టతనిచ్చారు.

కేంద్ర ఖజానాపై రూ.1 లక్ష కోట్ల భారం..

ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర రాబడి ప్రభావం (ఆదాయ నష్టం) పడుతుందని అంచనా వేశారు. అయినప్పటికీ, ప్రజల " సంక్షేమం, దేశీయ వృద్ధిని కాపాడడిమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ భారాన్ని తానే భరిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు కేంద్రం మూడు ముఖ్యమైన అంశాలపై (3Fs) ప్రత్యేక దృష్టి సారించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇంధనం, ఎరువులు, విదేశీ మార్పిడి నిల్వలపై దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయికి చేరాయని, అలాగే బంగారం ధరల పెరుగుదల వల్ల విదేశీ మారకద్రవ్యంపై కొంత ఒత్తిడి ఉందని ఆమె పేర్కొన్నారు. "సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎదురవుతున్నవే తప్ప. దేశీయంగా మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత పటిష్టంగా, స్థితిస్థాపకతతో (Resilient) ఉంది. కొందరు నెరటివ్స్ సృష్టిస్తూ నిరాశావాదాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ భారతదేశం ఇలాంటి భయాలకు చోటు ఇవ్వదు. మన చర్యలు, మాటలు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా ఉండాలి అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో ఇంధన కొరత లేకుండా చూసేందుకు, దేశీయ అవసరాలకు తగినంత స్టాక్ అందుబాటులో ఉంచేందుకు వీలుగా.. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రభుత్వం సుంకాలను సవరించిందని, దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా ఉపశమనం లభిస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు.

Next Story