- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US-Iran: అమెరికన్లే మా టార్గెట్: ఇరాన్ హెచ్చరిక
ఆదివారం తెల్లవారుజామున జరిగిన దాడుల ద్వారా తమ జాతీయ అణు విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: టెల్ అవీవ్-తెహ్రాన్ గొడవలోకి అగ్రరాజ్యం అమెరికా నేరుగా జోక్యం చేసుకుని ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు దిగడంతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ మూడు కీలకమైన అణు కేంద్రాలపై దాడులకు ప్రతిగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని 'ప్రతి అమెరికన్ పౌరుడు లేదంటే సైనిక సిబ్బంది'ని తెహ్రాన్ టార్గెట్ చేస్తుందని ఇరాన్ జాతీయ మీడియా ఆదివారం అమెరికాకే వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ యాంకర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడి చేసిన కారణంగా, వారు మొదలుపెట్టిన దాన్ని తాము అంతం చేస్తానని ఉంది. ఇరాన్ గగనతల నిషేధాన్ని ఉల్లంఘించడం ద్వారా అమెరికా ఇరాన్ విషయంలో అతిపెద్ద నేరం చేసిందని మీడియా పేర్కొంది.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు: ఇరాన్
తమ అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులను ధృవీకరించిన ఇరాన్, ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన దాడుల ద్వారా తమ జాతీయ అణు విధానాన్ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించింది. ఈ ప్రకటనతో అణ్వాయుధాల తయారీలో ఇరాన్ వెనకడుగు వేసే ఉద్దేశం లేదనే విషయం స్పష్టమవుతోంది. అయితే, అమెరికా దాడుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను తెహ్రాన్ ప్రకటించలేదు. ఇదే సమయంలో ఇరాన్ తమ దేశ ప్రజలకు కీలక ప్రకటన జారీ చేసింది. 'శత్రువుల కుట్రలు, కుటిల దాడులతో మన యువ శాస్త్రవేత్తలు వెనకడుగు వేయరు. మన అణుశక్తి పరిశ్రమ అమరుల రక్తంతో కూడిన విజయం. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు' అని తెలిపింది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచానికి ఇరాన్ తన అణ్వాయుధాల తయారీపై స్పష్టత ఇచ్చింది.
మరో ప్రకటనలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. ఇది అమెరికాకు శాశ్వత గాయమని అన్నారు. తన చర్యలతో యూఎస్ అంతర్జాతీయ చట్టాలతో పాటు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఊలంఘించినట్టేనని తెలిపారు. నేరపూరిత చర్యల ద్వారా శాంతి మార్గంలో తాము తయారు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనికి అగ్రరాజ్యం శాశ్వత పరిణామాలను ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు.
అమెరికా నౌకల టార్గెట్
అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడంతో, ఇరాన్‌పై దాడులకు బదులుగా ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను టార్గెట్ చేస్తామని యెమెన్ హౌతీలు ప్రకటించారు. ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.






