రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్ సంచలన వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-01 03:41:22  IST  )

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి అమెరికాలో (America) ప్రతిష్టాత్మకంగా చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు.

రేపే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రభుత్వం తీసుకొచ్చిన 'బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు (Big Beautiful Bill)'ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ బిల్లుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజల హక్కులను హరించేలా ఉందంటూ విరుచుకుపడ్డారు. బిల్లును ఆమోదిస్తే.. వెంటనే కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుపై మస్క్‌ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, దేశ ప్రజల భవిష్యత్తు ముప్పులో పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేతకు మధ్య విభేదాలు కూడా తలెత్తాయి. అయితే, ఇటీవల ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ బిల్లుపై విరుచుకుపడుతూ మస్క్‌ ఎక్స్‌ వేదికగా వరుస పోస్టులు పెట్టారు. ఈ బిల్లులో టెక్ సంస్థలపై నియంత్రణ, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు, సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తే చర్యలు వంటి అంశాలున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ బిల్లు పిచ్చిదని స్పష్టంగా కన్పిస్తుందన్నారు. ఇది రుణపరిమితిని భారీగా 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతుందని పునరుద్ఘాటించారు. 'ప్రజల హక్కులను కాపాడే, నిజమైన స్వేచ్ఛకు అండగా నిలిచే రాజకీయ పార్టీ ఇప్పుడు అత్యవసరం. అవసరం అయితే నేనే ఒక కొత్త పార్టీని రేపే ప్రారంభిస్తాను' అని మస్క్ స్పష్టం చేశారు.

ఈసందర్భంగా ఆయన చట్టసభ సభ్యులపై కూడా పలు విమర్శలు చేశారు. ఇది ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతంగా పరిగణించబడుతోంది. అమెరికాలో రెండు ప్రధాన పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతున్న ఈ సమయంలో మస్క్ వ్యాఖ్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే, పారదర్శక పాలనకు తలమానికమయ్యే రాజకీయ వ్యవస్థకు ఇది నాంది కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, మస్క్ గతంలోనూ రాజకీయ వ్యవస్థపై పలుమార్లు విమర్శలు చేశారు. కానీ ఈసారి కొత్త పార్టీ ఏర్పాటు చేయడాన్ని నేరుగా ప్రకటించడం గమనార్హం.

Next Story