ఎలాన్ మస్క్ సంచలనం.. ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-06 02:00:23  IST  )

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నంత పని చేశాడు.

ఎలాన్ మస్క్ సంచలనం.. ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) చెప్పినట్లుగానే అన్నంత పని చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు (Big Beautiful Bill) చట్టసభలో ఆమోదం ఒక్కరోజు కూడా గడవక ముందే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ‘అమెరికా పార్టీ’ (America Party) పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేస్తున్నట్లుగా మస్క్ ప్రకటించాడు. 2:1 నిష్పత్తిలో, మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు అది లభిస్తుంది..! అవినీతితో మన దేశాన్ని దివాళా తీయించే విషయంలో మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది. ఇటివలే మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పార్టీ పెట్టే అంశంపై బహిరంగ ఓటింగ్‌ నిర్వహించారు. అనూహ్యంగా 80 శాతం ప్రజలు అతడికి నిర్ణయానికి జై కొట్టారు. ‘ది అమెరికా పార్టీ’ అంటూ అప్పట్లో ఆయన చేసిన పోస్ట్‌ యూఎస్ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ చట్టంగా మారింది. కాంగ్రెస్‌లోని ఉభయసభలు బిల్లకు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు 1.2 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మెడిక్‌ఎయిడ్, ఆహార కూపన్ల కోత విధించేలా తీసుకొచ్చిన చట్టమిది. ఇదే బిల్లు ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య స్నేహంలో చిచ్చుపెట్టింది. బహిరంగ వేదికలతో పాటు X వేదికగా మస్క్ ప్రెసిడెంట్‌పై బిగ్ బ్యూటీఫుల్ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ బిల్లుతో అదేవిధంగా 1.2 కోట్ల అమెరికా ప్రజలు ఆరోగ్య బీమాకు దూరం కానున్నారు. డొమెస్టిక్ పాలసీ, టాక్స్ లెజిస్లేషన్‌తో రాబోయే దశాబ్దంలో 3.3 ట్రిలియన్ డాలర్ల ద్రవ్య లోటు ఏర్పడనుంది. ఫెడరల్ ఖర్చులు, ఆర్థిక లోటును మరింత పెరగనుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి హానికరం కానుంది.

Next Story